Site icon HashtagU Telugu

Weekly Worship Guide: వారంలో ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి.. దానివల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

Weekly Worship Guide

Weekly Worship Guide

హిందువులు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. జీవితంలో దేవుడి ఆరాధనకు కూడా ప్రత్యేకించి ఒక ముఖ్యమైన స్థానం ఉంది. ప్రతీ రోజూ దేవుడికి పూజ చేయడం వలన జీవితంలో శాంతి, ఆనందం, ఆత్మ విశ్వాసం లభిస్తాయని నమ్మకం. అయితే హిందువులు ఎంతో మంది దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని ప్రత్యేకంగా పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. మరి ఏ రోజు ఏ దేవుడిని పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సోమవారం శివుడికి అంకితం చేయబడింది. సోమవారం రోజున శివుడిని పూజించి, శివుడికి అభిషేకం చేస్తారు. సోమవారం రోజున సమీపంలోని శివాలయానికి వెళ్లి శివయ్యను సందర్శించి అభిషేకం చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే శివయ్య అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

అలాగే మంగళవారం చాలా పవిత్రమైన రోజుగా పరిగణించాలి. ఈ రోజున హనుమంతుడిని పూజిస్తూ ఉంటారు. మంగళవారం రోజున హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలోని భయాలు, అడ్డంకులు, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్మకం.

ఇక బుధవారం రోజు విజ్ఞాలకు అధిపతి అయినా విఘ్నేశ్వరుడిని పూజిస్తారు. గణేష్ ని పూజించడం వల్ల జ్ఞానం తెలివి లభిస్తాయని నమ్మకం. గణపతి ఆలయాలలో పూజ చేయడం వల్ల చేపట్టిన పనులలో ఆటంకాలు లేకుండా సక్సెస్ అవుతాయని నమ్మకం.. అందుకే ఏదైనా శుభకార్యం మొదలుపెట్టేటప్పుడు గణేశున్ని తప్పకుండా పూజించాలని చెబుతూ ఉంటారు.

అలాగే గురువారం విష్ణువు రోజుగా పరిగణిస్తారు. అలాగే ఈరోజు సాయిబాబా అని కూడా పూజిస్తూ ఉంటారు. కాగా విష్ణువు ఆరాధించే వారికి సామరస్యం, స్థిరత్వం, ఆధ్యాత్మిక వృద్ధికి మార్గాన్ని చూపిస్తాడట. ఈ రోజున ప్రజలు విష్ణు సహస్రనామ జపించి భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.

శుక్రవారం రోజు అమ్మవారి ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ రోజున దుర్గాదేవి వేద లక్ష్మీదేవి అలాగే ఇంకా కొంతమంది అమ్మవార్లను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేస్తే అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఇక శనివారం రోజున శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఈరోజున వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తూ ఉంటారు. నవగ్రహాల ఉన్న మందిరంలో పూజలు చేయడం నువ్వుల నూనె దీపం వెలిగించడం కూడా మంచిది. ఇలా నువ్వుల దీపం వెలిగించడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

వారంలో మొదటి రోజుగా పరిగణించబడే ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ సూర్యుడిని పూజించే వారికి మంచి ఆరోగ్యం, శక్తిని ఇస్తాడని నమ్మకం.