Mukkoti Ekadashi : హిందూ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మిదేవిలను పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఆచరంచి భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణుడిని పూజిస్తే మరణానంతరం వైకుంఠ ధామంలో స్థానం లభిస్తుందని బలంగా నమ్ముతారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు లోక పోషకుడైన శ్రీమహావిష్ణువును పూజించడం, ఏకాదశి వ్రతం ఆచరించడం ఎంతో శుభప్రదం. ఈ క్రమంలో వైకుంఠ ఏకాదశి రోజు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Vaikuntha Ekadashi 2025
వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశికి సనాతన ధర్మంలో ఎంతో పవిత్రమైన, విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ముక్కోటి రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు ఆచరించే పూజలు, ఉపవాసం, దానధర్మాలు పాపాలను నశింపజేసి.. మనస్సును శుద్ధి చేయడానికి అత్యుత్తమ అవకాశమని పండితులు చెబుతారు. ఈ ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadasi) రోజున నిర్జల ఉపవాసం పాటించడం ద్వారా శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడంతో పాటు జీవితంలో సుఖసంతోషాలు, సిరిసంపదలు, శ్రేయస్సు పొందుతారని ప్రగాఢ నమ్మకం. అంతే కాకుండా వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించడం వల్ల మోక్షాన్ని పొందే మార్గం సులభతరం అవుతుందని కూడా విశ్వసిస్తారు. ఇలా చేయడం వల్ల మరణానంతరం వైకుంఠ ధామం చేరుతారని నమ్ముతారు. ఇంతటి పవిత్రమైన ఏకాదశి రోజు పొరపాటున కూడా చేయకూడని తప్పులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Vaikuntha Ekadashi Mukkoti
వైకుంఠ ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు
ఏకాదశి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రి నిరాహారులై లేదా మితాహారులై ఉండాలి.
ఏకాదశి రోజంతా కఠిన ఉపవాసం ఉండాలి.
ఏకాదశి రోజున అబద్ధం ఆడకూడదు. తప్పుడు మాటలు మాట్లాడకూడదు.. తప్పుడు ఆలోచనలు చేయకూడదు.
స్త్రీ సాంగత్యం, మద్యపానం, మాంసాహారం తినడం వంటివి చేయకూడదు.
చెడ్డ పనులు, చెడు ఆలోచనలు, ఇతరులకు హాని చేయకూడదు. కోపం తెచ్చుకోకూడదు.
వైకుంఠ ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
ముక్కోటి ఏకాదశి రోజు అన్నదానం చేయడం అత్యంత శుభప్రదం.
Sri Vaikuntha Ekadashi
ఏకాదశి అంటే 11. ఐదు జ్ఞానేంద్రియాలు.. ఐదు కర్మేంద్రియాలు.. ఒక మనస్సు.. ఈ పదకొండింటిని అదుపులో ఉంచుకోవడం.. పవిత్రంగా ఉంచుకోవడమే ఏకాదశి. కాబట్టి పదకొండు ఇంద్రియాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మనస్సులో భగవంతుడి నామాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి. లక్ష్మీనారాయణుడిని పూజించాలి. శ్రీమహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ధూపదీపం, పుష్పాలతో, అక్షింతలతో పూజించాలి.. నైవేద్యాన్ని సమర్పించాలి.. నారాయణ మంత్రాలను జపించాలి. వైకుంఠ ఏకాదశి ఉపవాస కథను చదవాలి. రాత్రివేళ జాగారం చేస్తూ భగవంతుడిని ధ్యానించాలి. వైకుంఠ ఏకాదశి ముందు రోజు రాత్రి నేలపై నిద్రించాలి.
హిందూ క్యాలెండర్ ప్రకారం 2025 వైకుంఠ ఏకాదశి తిథి డిసెంబర్ 30వ తేదీ మంగళవారం రోజు వచ్చింది. ఈ ముక్కోటి ఏకాదశి తిథి డిసెంబర్ 30వ తేదీ మంగళవారం ఉదయం 7.51 గంటలకి ప్రారంభమవుతుంది. తర్వాత డిసెంబర్ 31వ తేదీ బుధవారం (Wednesday) ఉదయం 5.01 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం వైకుంఠ ఏకాదశి పండుగను డిసెంబర్ 30వ తేదీ మంగళవారం రోజు జరుపుకోవాలి. తదనుగుణంగా వ్రతం, ఉపవాసం ప్లాన్ చేసుకోవాలి.
