ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్(Haridwar )లో ఆదివారం ఉదయం ఘోర విషాదం (Haridwar Stampede) చోటు చేసుకుంది. మానసాదేవి ఆలయంలో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన లో ఆరుగురు భక్తులు దుర్మరణం చెందగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కావడంతో వేడుకల నిమిత్తంగా వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అయితే జనసందోహం విపరీతంగా పెరగడంతో పరిస్థితిని నియంత్రించలేని స్థితి ఏర్పడింది.
ఆలయ సమీపంలో కరెంటు తీగలు తెగిపోవడం తో భక్తులు ఖంగారుపడి..భయభ్రాంతులకు గురయ్యారు. ఇదే సమయంలో భక్తులంతా ఒక్కసారిగా పరుగులు తీయడంతో..వారిలో కొంతమంది కిందపడ్డారు..వారిని చూసుకోకుండా చాలామంది వారిమీదనుండే నడిచేసరికి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆలయ ప్రాంగణాన్ని విషాద ఛాయలు చుట్టుముట్టింది.
Thailand – Cambodia : థాయ్‌లాండ్-కంబోడియా ఘర్షణలకు ట్రంప్ మధ్యవర్తిత్వం..?
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడినవారిని హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న కొంతమందిలో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు జిల్లా యంత్రాంగం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఆలయ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనతో హరిద్వార్ ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మానసాదేవి ఆలయం అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే పవిత్ర స్థలమైనందున, భద్రత విషయంలో నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటే, పుణ్యక్షేత్రాల్లో తగిన భద్రతా చర్యలు తీసుకోవడం ఎంతగానో అవసరం అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.