Site icon HashtagU Telugu

Hanuman: స్త్రీలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎందుకు తాకకూడదో తెలుసా?

Hanuman

Hanuman

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో హనుమంతుడు కూడా ఒకరు. హనుమంతుడిని ప్రతి మంగళవారం శనివారాలలో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ప్ర‌తి మంగ‌ళ‌వారం హ‌నుమాన్ ఆల‌యాల‌న్నీ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతుంటాయి. పురుష‌, స్త్రీ అనే బేధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ ఆంజ‌నేయుడి ఆల‌యానికి వెళ్లి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తుంటారు. హ‌నుమంతుడిని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తే కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌నేది భ‌క్తుల న‌మ్మ‌కం. అయితే ఆంజ‌నేయుడిని పూజించే స‌మ‌యంలో కొన్ని నియ‌మాలు పాటించాలి.

మ‌రి ముఖ్యంగా మ‌హిళ‌లు హ‌నుమంతుడి విగ్ర‌హాన్ని తాక‌కూడ‌దన్న నియమం కూడా ఒకటి. హ‌నుమాన్‌ ను ఆరాధించే సమయంలో మహిళలు కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలు పాటించాల్సి ఉంటుంది. హనుమంతుడు అంత గొప్పవాడు కావడానికి ఆయన చేసిన బ్రహ్మచర్య దీక్షే కారణమని చాలామంది నమ్ముతారు. ఈ రామ భక్తుడు జీవితకాల బ్రహ్మచర్యం చేశాడు. అత్యంత కఠినమైన బ్రహ్మచారి కాబట్టి, మహిళలు ఈ దేవుడిని తాకితే అపవిత్రం చేసినట్లు అవుతుందని నమ్ముతారు. హనుమంతుడు తన గురువు, సూర్య భగవానుడైన సూర్య దేవ్ నుంచి ఆయుర్వేదం, ధ‌నుర్వేదం, గాంధ‌ర్వ వేదం, స్థాప‌త్య వేదం అనే నాలుగు విద్యలను నేర్చుకోవాలని కోరుకున్నాడు. సూర్యుడు హనుమంతుడికి ఈ విద్యలను నేర్పించడానికి ఒప్పుకున్నాడు.

కానీ ఒక షరతు పెట్టాడు. తన కూతురు సువర్చలాదేవిని వివాహం చేసుకోవాలని ఆంజనేయ స్వామికి షరతు పెట్టాడట. హనుమంతుడు బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు. కానీ సూర్యుడి గురుదక్షిణ కోరికను తిరస్కరించలేకపోయాడు. ఈ విధంగా, హనుమంతుడు భౌతిక సంయోగం కోసం కాకుండా, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం వివాహం చేసుకున్నాడని ప్రతీతి. వివాహితుల‌కు మాత్ర‌మే ఈ నాలుగు విద్య‌ల‌ను నేర్పించేవార‌ట‌. సన్యాసి అయిన సువర్చల పెళ్లి జరిగిన వెంటనే తపస్సులో మునిగిపోయిందట. దీనివల్ల హనుమంతుడు బ్రహ్మచర్య దీక్షకు భంగం కలగలేదు. ఆ విధంగా పెళ్లయినా సరే బ్రహ్మచారిగానే ఉంటూ నాలుగు శాస్త్రాలను నేర్చుకున్నాడట. ఆంజ‌నేయుడు స్త్రీలను మాతృమూర్తిగా భావిస్తాడు. ప్రతి స్త్రీకి తల్లి హోదా ఇస్తాడు. అందుకే తల్లి ఆయన పాదాలను తాకకూడదనే ఆచారం విగ్రహానికి విస్తరించింది. కాబట్టి హనుమంతుని బ్రహ్మచర్యానికి గౌరవసూచకంగా స్త్రీలు స్వామి విగ్రహాన్ని తాకకూడదు. దీపాలు వెలిగించడం, హనుమాన్ చాలీసా పఠనం, ప్రసాదం అందించడం వంటి ఇతర పూజా కార్యక్రమాలలో పాల్గొనవచ్చు.