మధ్యప్రదేశ్ బుందేల్ ఖండ్ లో పన్నాలోని పురాతన సిద్ధ స్థలం శ్రీ హనుమాన్ భట. ఇక్కడ చందేల్ కాలం నాటి హనుమంతుడి రాతి విగ్రహం ఉంది. అలాగే నరసింహ స్వామి, మహాకాళుడు కూడా ఇక్కడ ఉన్నారు. మంగళ, శనివారాల్లో భారీ సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తుంటారు. అయితే ఈ ఆలయంలో పూజలను అందుకుంటున్న హనుమంతుడికి సంబంధించిన ఒక నమ్మకం ఉంది. అదేమిటంటే నిర్మలమైన హృదయంతో హనుమంతుడిని దర్శించుకుంటే ఖచ్చితంగా కోరిన కోర్కెలు నెరవేరాతాయట.
కాగా హనుమాన్ భట ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్న ప్రదేశం. ఇక్కడికి చేరుకున్న వెంటనే మానసిక శాంతి, ఆనందాన్ని అనుభవిస్తారట. ఈ ఆలయానికి 5 మంగళవారాలు వెళ్ళడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని, దుఃఖాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పన్నా జిల్లాలోని పావే తహసీల్ లోని మోహంద్ర రోడ్డుకి సమీపంలో అత్యంత ఎత్తైన కొండలపై ఈ హనుమంతుడి ఆలయం ఉంది. భక్తులు ఈ ఆలయాన్ని శ్రీ హనుమాన్ భట ధామ్ పేరుతో పిలుస్తారు. హనుమంతుడి వద్దకు దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. తమ కోరికలను ఆ స్వామికి విన్నవించుకుంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం స్వామిని కోరుకున్న కోర్కె తీరకుండా ఖాళీ చేతులతో ఎవరూ తిరిగి వెళ్లలేదట.
భక్తిశ్రద్ధలతో ఎలాంటి కల్మషం లేకుండా స్వామిని పూజిస్తే తప్పకుండా కోరికలు నెరవేరుస్తారని భక్తులు నమ్మకం. ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఇక్కడ ఒక భారీ ఉత్సవం జరుగుతుందట. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు హనుమంతుని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. వరుసగా 5 మంగళవారాలు బజరంగ్ బలి పాదాలను ఎవరు పూజిస్తారో వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. పదకొండు వందల మెట్లు ఎక్కి ఐదు మంగళవారాలు లేదా ఐదు శనివారాల్లో ఈ ప్రదేశంలో పూజలు చేస్తే వారి కోరికలన్నీ నెరవేరుతాయట.