Site icon HashtagU Telugu

Kanaka Durga Temple : దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు

Durggamma Prasadam

Durggamma Prasadam

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయం(Kanaka Durga Temple)లో నిత్యం వేలాది భక్తులు దర్శనానికి వచ్చి ప్రసాదాలను (Laddu Prasadam) స్వీకరిస్తుంటారు. అయితే ఆలయంలో అందజేసే ప్రసాదాల నాణ్యతపై తాజాగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ భక్తుడికి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు (Hair ) కనిపించడం అతన్ని షాక్ కు గురయ్యేలా చేసింది. తాను మాత్రమే కాకుండా, తన భార్య కొనుగోలు చేసిన లడ్డూలోనూ వెంట్రుకలు కనిపించడంతో ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. సదరు భక్తుడు దేవాదాయ శాఖను ట్యాగ్ చేస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. విజయవాడ దుర్గ గుడి ప్రసాద నాణ్యతపై నిత్యం అనేక మంది భక్తులు ప్రశ్నిస్తున్నా, సంబంధిత అధికారులు దృష్టి సారించలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అనేక మంది భక్తులు తమకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేశారు. దేవాదాయ శాఖ వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Maha ShivaRatri 2025: మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు నియమాలు.. అవేంటో తెలుసా?

ఈ ఘటనపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. భక్తుడికి క్షమాపణ తెలియజేశారు. అలాగే, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆలయ కిచెన్‌ను త్వరలో స్వయంగా సందర్శించి పరిస్థితులను సమీక్షిస్తానని ఆయన తెలిపారు. ప్రసాదాల తయారీ విధానంలో మరింత శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే గుడిలో తాగునీటి సమస్య కూడా భక్తుల కోసం తలనొప్పిగా మారింది. గత నెలలో కొందరు భక్తులు దీనిపై ఫిర్యాదు చేయగా, మంత్రి నారా లోకేష్ సత్వరమే స్పందించి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఆలయ పరిసరాల పరిశుభ్రత, భక్తులకు మెరుగైన సేవలు అందేలా మరింత దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.