కేరళ త్రిసూర్ జిల్లాలోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం(guruvayur sri krishna mandiram) తన ఖజానాలో 260 కిలోలకు పైగా బంగారం ఉన్నట్లు ప్రకటించింది. ఆలయ అధికారులు ఒక సమాచార హక్కు (ఆర్‌టిఐ) దరఖాస్తుకు సమాధానంగా ఈవివరాలను వెల్లడించారు. ఆలయంలో విలువైన ఆభరణాలు , నాణేలు సహా 263.63 కిలోల బంగారం, సుమారు 20,000 బంగారు లాకెట్లు ,5,359 వెండి లాకెట్లు,6,605 కిలోల వెండి ఉన్నాయని తెలిపారు. ఇటీవల దేవస్థానం రూ. 1,700 కోట్లకు పైగా బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు వెల్లడించింది. 271.05 ఎకరాల భూమి కూడా ఉందని తెలిపింది. అయితే, పినరయి విజయన్ (Pinarayi Vijayan) ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016 నుంచి కేరళ ప్రభుత్వం నుంచి ఆలయానికి ప్రభుత్వ ఆర్థిక సాయం అందడం లేదని పేర్కొంది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశించినప్పటికీ 2018-19 వరదల తరువాత ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించిన 10 కోట్ల రూపాయలను దేవస్థానం ఇంకా స్వీకరించలేదని స్పష్టం చేసింది.
ఎంకే హరిదాస్ ఆవేదన ఇదీ..
భద్రతా కారణాల దృష్ట్యా ఈ వివరాలను చెప్పేందుకు ఆలయ నిర్వాహకులు గతంలో నిరాకరించారు.గురువాయూర్‌కు చెందిన ఎంకే హరిదాస్ (MK Haridas) మరియు ప్రాపర్ ఛానెల్ అనే సంస్థ అధ్యక్షుడు ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఈ సమాచారాన్ని రిలీజ్ చేశారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సంక్షేమంపై ఆలయ దేవస్వామ్ నిర్లక్ష్యం, నిష్క్రియాపరత్వమే తనను ఆర్టీఐ ద్వారా వివరాలు కోరేలా చేసిందని హరిదాస్ ఆరోపించారు.ఆలయం సమీపంలో యాజమాన్యం ఆసుపత్రిని నడుపుతోంది కానీ దాని పరిస్థితి, నిర్వహణ దయనీయంగా ఉందని ఆయన ఆరోపించారు. ‘ప్రసాదం’ పంపిణీ విషయంలో దేవస్థానంపై హరిదాస్ విమర్శలు చేశారు. రోజువారీ కైంకర్యాలు, నివేదనలకు అవసరమైన పూల కోసం తోటను పెంచడానికి కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శతాబ్దాల చరిత్ర కలిగిన గురువాయూర్ ఆలయాన్ని ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి వేలాది మంది సందర్శిస్తుంటారు.