Site icon HashtagU Telugu

Guruvayur Krishna Leelas : గురువాయూర్ కృష్ణ లీలలు..!

Guruvayur Krishna Leelas

Guruvayur Krishna Leelas

Guruvayur Krishna Leelas : మంజుల గురువాయూర్ లో నివసించే అతి పేదబాలిక. చిన్నప్పటినుండి గురువాయూర్ కృష్ణుడంటే అమితమైన ఇష్టం. ఆలయంలోని కృష్ణుడికి రకరకాల మాలలు కట్టి ఇచ్చేది. వాటిని అలంకరించుకుని ముగ్ధమనోహరంగా కనిపించే గురువాయూర్ (Guruvayur) అప్పన్ దర్శించడంలో ఏదో చెప్పలేని ఆనందాన్ని తృప్తిని పొందేది ఆ చిన్న బాలిక. ఆనాడు మంజులకు కృష్ణునికి కావలసిన పువ్వులు సేకరించడంలో ఆలస్యమయింది.

ఎక్కడెక్కడో తిరిగి అతికష్టంమీద గులాబీ, మందారం, చేమంతి, గన్నేరు, మల్లి, కరవీర మొదలైన పువ్వులు సేకరించేసరికి సాయంత్రమైపోయింది. సూర్యాస్తమయ సమయానికి సేకరించిన పూలను తులసీ దళాలను మధ్యమధ్యలో పెట్టి మాలగా కట్టడం మొదలెట్టింది. గురువాయూరప్పన్ కి అందాన్నిచ్చే ఆ ఎఱ్ఱ వర్ణపు మాలని ఒక తాడుకు కట్టి కళ్ళారా తృప్తిగా చూసింది.

హరికెన్ లాంతరు వెలుగులోనే అందంగా వున్న ఆ మాల నేతిదీపాల వెలుగులలో గురువాయూరప్పన్ కి అలంకరిస్తే ఇంకా ఎంత అందంగా వుంటుందో ఊహించుకుంటూ వివరించలేని ఆ చిన్న మనస్సులో మెదులుతున్న భక్తిభావంతో మంజుల నేత్రాలు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. కానీ ఈ పూలమాలలు కట్టడంలో సమయం మించిపోతున్నది. తన గుడిసెకు ఆలయానికి చాలా దూరం. ఆలయం మూసేలోపల అక్కడికి చేరుకొని కృష్ణుని కి అలంకరింపజేయాలి.

ఆ ఆలోచన రాగానే పూలమాలను పట్టుకొని ఆలయానికి పరుగెత్తింది. పరుగంటే చెప్పలేనంత వేగంగా, తన వయసుకు, శక్తికి మించి పరుగెత్తి వెళ్ళినా రాత్రి 7. 30 దాటింది. అప్పటికి అర్ధ జాము పూజ ముగించి పూజారులు అప్పన్ ఆలయం తలుపులు మూసివేస్తారు. గురువాయూరప్పన్ ఆలయ సమీపమున వున్న మఱ్ఱి చెట్టు దాకా పరిగెత్తి వచ్చి ఊపిరి పీల్చుకుని మాల కేసి చూసింది. ఒక్క రేకు కూడా రాలకుండా మాల అలాగే తాజాగా వుంది.

అప్పన్ లీల ఎవరికి తెలుసు..?

ఇంతలో ఆలయం తలుపులు మూసేసిన శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినగానే ఆబాలికకు విపరీతమైన దుఃఖం ముంచుకొచ్చింది. ఉన్నచోటనే కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది.గురువాయూర్ (Guruvayur) అప్పన్ కు పరమభక్తుడైన ‘పూందాణ నంబూద్రీ’ అప్పన్ ని స్తుతిస్తూ.. ఆ మార్గం గుండా వెడుతున్నారు. అందమైన మాల చేతిలో పట్టుకుని దుఃఖిస్తున్న ఆ బాలిక వద్దకు వచ్చారు నంబూద్రీ. “పాపా.. ఎందుకు ఏడుస్తూ వున్నావు? ఏం జరిగింది?” అని అడుగగానే మంజుల జరిగిన విషయం చెప్పి ‘ఈరోజు స్వామికి తన మాలను సకాలంలో అందివ్వలేక పోయినందుకు ఏడుస్తున్నానని చెప్పింది.

అందుకు ఆ భక్తుడు… “పాపా.. ఏడవకు, కృష్ణుడు ఒక్క ఆలయంలోనే కాదు సర్వత్రా వ్యాపించి వున్నాడు. ఈ ప్రకృతిలో ఎక్కడ చూసినా ఆ అప్పన్ వున్నాడు. నీవు కట్టిన ఆ మాలను ఈ మఱ్ఱి చెట్టు కొమ్మకి అలంకరించు. నీ పూమాల గురువాయూరప్పన్ కి చేరుతుంది. భక్తితో సమర్పించిన పుణ్యం నీకు దక్కుతుంది. ఏడవకు.. మాల వేసి ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపో ..!” అని చెప్పి వెళ్ళిపోయారు ఆ భక్తుడు. మంజుల తను తెచ్చిన మాలను చెట్టుకు వేసి, భక్తితో నమస్కరించి ఇంటికి వెళ్ళిపోయింది.

తన నామపారాయణం జరిగే ప్రతిచోటా నివాసించే గురువాయూర్ (Guruvayur) అప్పన్(శ్రీకృష్ణుడు), మఱ్ఱి చెట్టుకి అలంకరించిన ఆ మాలను తీసుకుని తన కంఠాన అలంకరించు కున్నాడు. మరునాడు ఉదయాన్నే ఆలయ భట్టరు ఆలయ దీపంతోను, రాగి చెంబులో తీర్ధం తీసుకుని తలుపులు తెరిచారు. ముందుగా లోపలున్న స్వామికి బయటనుండే సాష్టాంగ నమస్కారం చేసి, ఆలయ ఆవరణలో ప్రదక్షణం చేసి గర్భగుడి తలుపులు తీశారు.

తర్వాత నిర్మాల్య పూజలు ఆరంభించారు. తెర వేసి వుండగా సుప్రభాత సేవకి భక్తులు రావడం ప్రారంభించారు. భట్టరు ముందురోజు అలంకరించిన మాలలు ఒక్కొక్కటిగా తీయసాగారు. ముందటి రోజు తాను అలంకరించని ఒక పూల మాలను మాత్రం ఎంత ప్రయత్నించినా కృష్ణుని నుండి తీయలేక పోయారు. ఆ ఆలయపు దీపపు కాంతిలో ఆ పూలమాల కళ్ళు మిరుమిట్లు గొలపడం చూసి భట్టర్ ఆశ్చర్యపోయారు. “నా దైవమా! గురువాయూరప్పా.. ఏమిటి ఈ వింత? నేనేమిటి చూస్తున్నాను?” అని గట్టిగా అడిగారు.

Also Read:  TSRTC: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ప్రతి వీకెండ్‌కు ప్రత్యేక బస్సులు

”స్వామీ..! నేనేమైనా తప్పు చేశానా? అని భట్టరు కుమిలిపోతూ బయటికి రాగానే, ‘పూందాణమ్ నంబూద్రీ’ అనే భక్తుడు గత రాత్రి జరిగిన విషయాలన్నీ ఆయనకు వివరించారు. ఆలయ భట్టాద్రి ఒక పూమాలని తొలగించలేక పోయారన్న అతిశయాన్ని విని ఆ భక్తుని మనసు ఆనంద పారవశ్యం చెంది కవితాగానం చేశారు. ‘హరే కృష్ణా..హరే కృష్ణా ..’అని పెద్దగా పాడారు. స్వామి మెడలోని మాల ఆ బాలిక మంజుల చెట్టుకి అలంకరించిన మాల అయివుంటుంది అని తెర తొలగించమని భట్టరుని కోరారు నంబూద్రీ. తెర తొలగించగానే కోటి సూర్యుల ప్రకాశంతో గురువాయూరప్పన్, నవ్వుతూ దర్శనమిస్తూవుంటే, పూందాణం భక్తుడు… “నా తండ్రీ గురువాయూరప్పా… ఇది మంజుల నీకు సమర్పించిన మాల అయితే నిర్మాల్య పూజా సేవ కోసం నీవు ఆ మాలని తీసివేయడానికి అనుమతి ప్రసాదించు!” అని విన్నవించుకున్నారు.

వెంటనే ఆ పూలమాల మెల్లిగా తానే క్రిందికి జారింది. ఈ విశేషమంతా దూరం నుండి ఒక మూలగా నిలబడి చూస్తున్న ఆ చిన్న బాలిక మంజుల పరిగెత్తుకుని వెళ్ళి క్రింద పడిన ఆ మాలను తీసుకుని మరల ఆ మఱ్ఱి చెట్టుకి అలంకరించింది. ఆ బాలిక ముఖం దైవిక కళతో ప్రకాశిస్తూ వున్నది.”మంజులా.. మంజులే..” అంటూ అక్కడికి చేరిన భక్తుల ఆట పాటలతో దైవాన్ని కొలిచారు.

ఆ ఆలయ ప్రాంగణంలోని మఱ్ఱిచెట్టు గురువాయూరప్పన్ యీనాటికి భక్తులచేత మాలలు అలంకరింపజేసుకుంటూనేవున్నాడు. ఆ పేద బాలిక మంజుల.. మరియొక ఆండాళ్ అవతారమేనని, అప్పన్ తన కరుణను ,లీలలను ప్రపంచానికి చాటి చూపాడని భక్తుల విశ్వాసం.

ఆ మఱ్ఱి చెట్టు ఈనాటికీ గురువాయూరప్పన్ ఆలయ సమీపాన వున్నది.