గుడిమల్ల శివాలయం.. భారతదేశంలో ఏ శివాలయానికి లేని ప్రత్యేకత ఈ ఆలయానికి ఉంది. అంతేకాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందిన ఈ శివాలయానికి అనేక విశిష్టతలు ఉన్నాయని చెప్పాలి.. ఈ గుడిమల్ల ఆలయం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని గ్రామంలో ఉంది. ఇది తిరుపతికి 20 కిలో మీటర్లు ఉంటుంది. రేణిగుంట విమానాశ్రయం నుంచి అయితే సుమారు 10 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి శివుడు పరశు రామేశ్వరుడిగా పూజలందుకుంటున్నారు. ఈ పరశు రామేశ్వరుని ఆలయంలో గర్భాలయం అంతరాలయం, ముఖ మండపాల కంటే లోతులో ఉంటుందట.
అంతేకాకుండా ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి శివలింగం లింగ రూపంలో కనిపించదు. మానవ రూపంలో మహావీరుడైన వేటగాడిలా దర్శనమిస్తుంది. అనగా పురుషాంగం వలే కనిపిస్తూ ఉంటుంది. దాదాపుగా 5 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పుతో ఉంటుంది. లింగంపై ముందువైపు ఉబ్బెత్తుగా బయటకు పొడుచుకొని వచ్చినట్లు యక్షుని భుజాలపై నిలబడి శివుడు దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామి రెండు చేతులతో ఉండగా కుడిచేతితో ఒక పొట్టేలు ఎడమ చేతిలో చిన్న గిన్నెను పట్టుకొని దర్శనమిస్తాడు. ఎడమ భుజానికి గండ్ర గొడ్డలి తగిలించుకొన్నట్లు ఉన్నాడు. స్వామివారి జటలు అన్నీ పైన ముడివేసినట్లు, చెవులకు రింగులు, ఇతర ఆభరణాలు సైతం కనిపిస్తాయి.
అలాగే, నడుం చుట్టూ చుట్టి మధ్యలో కిందకు వేలాడుతున్నట్లు మోకాళ్ల వరకూ వస్త్రం ఉంటుంది. అలా ఇక్కడ స్వామివారి శరీర భాగాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా లింగం మొత్తం పురుషాంగాన్ని పోలి ఉంటుంది. గుడి మల్లం శివలింగం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దపు కాలం నాటిది. గుడిమల్లం 2009 వరకు వురావస్తు శాఖ అధీనంలో ఉంది. అప్పట్లో పూజలు జరగకపోవడంతో భక్తులు పెద్దగా రాలేదు. అప్పుడప్పుడూ వచ్చే భక్తులు, సందర్శకులకు పురావస్తు శాఖ ఉద్యోగి ఒకరు శివలింగాన్ని చూపించేవారు. గుడి మల్లం గ్రామానికి వెళ్లలేని వారి కోసం ఇక్కడి ఆలయంలోని మూల విరాట్టును అన్ని విధాలా పోలిన విగ్రహాన్ని చంద్రగిరి కోటలోని ప్రదర్శనశాలలో ఏర్పాటు చేశారు. ఈ శివలింగం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉంటుంది. గుడి మల్లం శివాలయ గర్భగుడి సైతం గజ పుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది. ఆలయంలో దొరికిన శాసనాల్లో దీనిని పరమేశ్వరాలయంగా చేబుతారు. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాల్లో క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందిన ప్రాచీన అవశేషాలు వెలుగు చూశాయి. ఒకప్పుడు ఎవరికీ ఈ ఆలయం గురించి తెలియదు. కానీ టెక్నాలజీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఆలయం గురించి ప్రతి ఒక్కరికి తెలియడంతో ఇక్కడికి సందర్శించి యాత్రికుల సంఖ్య భక్తుల సంఖ్య కూడా పెరిగిపోయింది.