Site icon HashtagU Telugu

Tirupati: వైభవంగా కోదండరాముని రథోత్సవం.. భక్తుల నీరాజనాలు

Ttd45

Ttd45

Tirupati: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. రథం నాలుగు మాడ వీధుల్లో ఊరేగి యథాస్థానానికి చేరిన తరువాత ప్రబంధం, వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు.

ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వ జ్ఞానమిదే. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకులు తిరుమంజనం, ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అశ్వవాహన సేవ వేడుకగా జరగనుంది.

Exit mobile version