TTD: ఫిబ్రవరి 16న రథసప్తమి, తిరుమల ముస్తాబు

  • Written By:
  • Updated On - February 16, 2024 / 12:05 AM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 16న శుక్ర‌వారం రథసప్తమి పర్వదినం నిర్వ‌హ‌ణ‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. శ్రీ‌వారి ఆల‌యంతోపాటు అన్న‌ప్ర‌సాదం, నిఘా మ‌రియు భ‌ద్ర‌త‌, ఇంజినీరింగ్, ఉద్యాన‌వ‌న త‌దిత‌ర విభాగాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. స‌ప్త వాహనాలపై స్వామివారి వైభ‌వాన్ని తిల‌కించేందుకు పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేయ‌నుండ‌డంతో అందుకు త‌గ్గ‌ట్టు టీటీడీ ఏర్పాట్లు చేప‌ట్టింది. శ్రీ‌వారి ఆల‌యంలో తెల్ల‌వారుజామున కైంక‌ర్యాలు పూర్త‌యిన త‌రువాత ఉద‌యం 4.30 గంట‌ల‌కు శ్రీమలయప్ప స్వామివారు ఆలయం నుండి వాహనమండపానికి వేంచేపు చేస్తారు. అక్క‌డ విశేష స‌మ‌ర్ప‌ణ చేప‌డ‌తారు.

ఉద‌యం 5.30 గంట‌ల‌కు సూర్యప్రభ వాహన‌సేవ మొద‌ల‌వుతుంది. అక్కడినుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోద‌యాన భానుడి తొలికిర‌ణాలు శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి పాదాల‌ను స్ప‌ర్శిస్తాయి. ఈ ఘ‌ట్టం భ‌క్తుల‌కు క‌నువిందు చేస్తుంది. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్తకోటికి సిద్ధిస్తాయి. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

శ్రీ‌వారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన‌ది గ‌రుడ వాహ‌నం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు.