Site icon HashtagU Telugu

Vinayaka Chaviti: వినాయక గ్రహాన్ని ఇంటికి తెస్తున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి!

Hq720

Hq720

దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. ఈ పండుగను చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ ముంబై లాంటి ప్రాంతాల్లో ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. అందుకే ఆ ప్రాంతాలకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ ఏడాది కూడా వినాయక చవితి పండుగ రానే వచ్చేసింది. సెప్టెంబర్ 7వ తేదీన ఈసారి వినాయక చవితి పండుగను జరుపుకోనున్నారు. అయితే వినాయక చవితి వచ్చింది అంటే చాలు చిన్న చిన్న విగ్రహాల నుంచి భారీ విగ్రహాల వరకు ఇళ్లకు తెచ్చుకొని మరీ పూజిస్తూ ఉంటారు.

పెద్ద గణనాథులను వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసి పూజిస్తే చిన్న చిన్న గణనాధులను ఇంట్లో పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. అయితే గణనాథులను పూజించడం మంచిదే కానీ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకున్నప్పుడు కొన్ని రకాల విషయాలను పాటించడం తప్పనిసరి అంటున్నారు పండితులు. మరి విగ్రహాన్ని ఇంటికి తెచ్చేటప్పుడు ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొదటిది రంగుల ఎంపిక.. మట్టి వినాయకుడిని పూజించడం అత్యంత శ్రేష్టం అని చెబుతున్నారు. ఒకవేళ మీరు రంగురంగుల వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవాలి అనుకుంటే తెలుపు రంగు విగ్రహాలను తెచ్చుకోవడం మంచిదని చెబుతున్నారు. తెలుపు రంగు శాంతి , స్వచ్ఛతకు చిహ్నం.

ఇంటికి శ్రేయస్సు, శాంతిని తీసుకురావడంలో మీకు సహాయపడుతుందట. అలాగే వినాయకుడు కూర్చున్న భంగిమను కూడా మనం గుర్తుంచుకోవాలి. కూర్చున్న భంగిమలో లేదా లలితాసనంలో ఉన్న విగ్రహాలను మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. ఈ భంగిమలు విశ్రాంతి, శాంతిని అందిస్తాయి. అలాగే ఇంటిని మరింత ప్రశాంతంగా మారుస్తాయని చెబుతున్నారు. వినాయకుడి తొండం ఎప్పుడూ కూడా ఎడమ వైపుకు ఉండే విధంగా చూసుకోవాలి. అలాంటి విగ్రహాలను మాత్రమే తీసుకురావడం ఆనందం శ్రేయస్సు లభిస్తుందట. అలాగే గణేశుని ఎప్పుడూ కూడా ఉత్తరం పడమర ఈశాన్యంలో మాత్రమే ఉంచి పూజించాలట. హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన దేవతలలో ఒకరైన శివుడు ఇంటి ఉత్తర దిశలో నివసిస్తాడు కనుక గణేశ విగ్రహాన్ని కూడా అదే దిశలో ఉండాలనీ పండితులు చెబుతున్నారు.