Irumudi: హిందువులు కార్తీక మాసం మొదలైంది అంటే చాలు రకరకాల మాలలు ధరిస్తూ ఉంటారు. అందులో భాగంగానే అయ్యప్ప స్వామి మాల, వెంకటేశ్వరుడి మాల,ఆంజనేయ మాల, దుర్గామాత మాల, శివ మాల వంటివి ధరిస్తూ ఉంటారు. కార్తీక మాసం మొదలు శివరాత్రి వరకు ఈ మాలలను ధరిస్తూ ఉంటారు. తమ కోరికలు తీరాలని, సత్ప్రవర్తన రావాలని, చెడు అలవాట్లను దూరం చేసుకోవడం కోసం దీక్షలు, మాలలు వేస్తుంటారు. దేవుడి మాలల్లో అతి ముఖ్యమైన మాల అయ్యప్ప స్వామిది. అయ్యప్పమాల అత్యంత పవిత్రమైనది కఠినమైనది కూడా.
ఈ మాల ధరిస్తే నిష్టతో దైనందిన జీవితం మారుతుంటుంది. అయ్యప్ప మాల అతి ముఖ్యమైన అంశం ఇరుముడి. అయ్యప్ప ఆలయాన్ని సందర్శించే భక్తులు ఇరుముడి సమర్పిస్తుంటారు. ఇంతకీ ఇరుముడి అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే.. అయ్యప్ప దీక్షాపరులు కచ్చితంగా ఇరుముడి వినియోగిస్తారు. ఇరుముడి అంటే రెండు ముడులు అని అర్థం. అంతేకాకుండా ఇరుముడి అంటే ముడుపులు అని అర్థం కూడా ఉంది. ఇరుముడిని భక్తి, శ్రద్ధ అనే రెండు భాగాలుగా పేర్కొంటారు. భక్తి భాగంలో ముద్ర కొబ్బరికాయను ఉంచి శ్రద్ధ భాగంలో తాత్కాలిక అవసరాల కోసం ద్రవ్యాలను ఉంచుతారు. ఇరుముడిలో రెండు భాగాలు ఉంటాయి.
అందులో తొలి భాగం.. నేతితో నింపిన కొబ్బరికాయ, పసుపు, అగరువత్తులు, సాంబ్రాణి, వత్తులు, తమలపాకులు, పోకవక్కలు, నిమ్మకాయ, బియ్యం, పెసరపప్పు, అటుకులు, మరమరాలు, పైపెంకు నూరిన కొబ్బరికాయలు 3 ఉంటాయి. ఇక ఇరుముడిలో రెండో భాగంలో.. శబరిమల యాత్రలో అవసరమైన బియ్యం, ఉప్పు, మిరపకాయలు, పప్పు, నూనె వంటి వస్తువులు, రవిక ముక్కలు వంటివి ఉంటాయి. ఇరుముడిని ఓంకార తాటుతో బిగించి కడతారు. ముద్ర సంచిలో గురుస్వామి మూడు సార్లు బియ్యం వేయడంతో భక్తులు మూడు విధాల విఘ్నాలు అధిగమిస్తారనే విశ్వాసం ఉంది.
ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక వంటి వాటిని అధిగమిస్తారని అయ్యప్పమాల దీక్షాపరులు భావిస్తారు. అయితే అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులకు శబరి యాత్ర చేసే సమయంలో ఇరుముడి కడుతారు. ఇరుముడి కట్టాక మళ్లీ ఇంటికి వెళ్లరాదనే నియమం ఉంది. యాత్రకు బయలుదేరే ముందు గ్రామ దేవతకు చేసే ప్రార్థన ఇది. తన కుటుంబాన్ని తాను తిరిగి వచ్చేంతవరకు కాపాడమని ప్రార్థిస్తూ గుమ్మం వద్ద కొబ్బరికాయ కొట్టి తన పరివార గణంలో ఒక గణాన్ని ఇంటి రక్షణకు ఉంచుతాడు. యాత్ర పూర్తయిన అనంతరం తిరిగి వచ్చినప్పుడు గుమ్మం వద్ద ఉన్న దేవతకు నమస్కరించి కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ కారణం చేత ఇరుముడి కట్టాక ఇంట్లోకి వెళ్లకూడదు.
Irumudi: అయ్యప్ప స్వాముల ఇరుముడి అంటే ఏమిటి.. అందులో ఏమేమి ఉంటాయో మీకు తెలుసా?

Irumudi