Site icon HashtagU Telugu

Karni Mata Temple: ఈ ఆలయంలో అమ్మవారితో పాటు ఎలుకలకు కూడా నైవేద్యం పెడతారట.. ఆ గుడి ఎక్కడ ఉందంటే!

Karni Mata Temple

Karni Mata Temple

భారతదేశంలో ఉన్న ఆలయాల్లో రాజస్థాన్‌ లోని బికనీర్ జిల్లాలోని దేశ్నోక్‌ లో కర్ణిమాత ఆలయం కూడా ఒకటి. అయితే ఈ ఆలయం ఎలుకల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం దుర్గాదేవి అవతారంగా భావించే కర్ణి మాతకు అంకితం చేయబడిందట. అయితే ఈ ఆలయానికి చెందిన అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇక్కడ భారీ సంఖ్యలో నల్ల ఎలుకలు బహిరంగంగా తిరుగుతాయట. వీటిని కాబా అని పిలుస్తారు. ఈ ఆలయంకి వెళ్లే భక్తులు ఈ ఎలుకలకు ప్రసాదాన్ని అందిస్తారట. ఈ ప్రసాదాన్ని ఎలుక తాకినా లేదా వావి తినగా మిగిలిపోయిన ఆహారాన్ని తిన్నా అది శుభ సంకేతంగా పరిగణించబడుతుందట. ఆ ఎలుకలు భక్తులు పెట్టే ఆహారం తింటే వారు దానిని అదృష్టంగా బావిస్తారు.

ఆలయ నమ్మకం ప్రకారం ఈ ఎలుకలు సాధారణ జీవులు కావు. అయితే ఆ ఎలుకలు కర్ణి మాత వారసులు, అనుచరులకు పునర్జన్మలట. కర్ణిమాతా పెంపుడు కుమారుడు లక్ష్మణ్ కోలయత్ తెహసీల్ లోని కపిల్ సరోవర్ వద్ద సరస్సులో నీరు తాగే ప్రయత్నంలో ఆ సరస్సులో పడిపోతాడు. అప్పుడు కర్ణిమాత యమునితో ఆయనను కాపాడమని కోరుతుందట. మొదట యముడు తిరస్కరించినా చివరికి మనసు మార్చుకొని లక్ష్మణ్ తో పాటు కర్ణిమాత మగ సంతానాన్ని ఎలుకలుగా పునర్జన్మ ఎత్తుతాడు అని చెప్పాడట. అప్పటి నుంచి ఎలుకలు కర్ణి మాత ఆలయంలో నివసించే సంప్రదాయం ఉందట. కాగా ఈ ఆలయంలో కొన్ని తెల్ల ఎలుకలు కూడా కనిపిస్తాయట. మాములుగా తెల్ల ఎలుకలు కనిపించడం అన్నది చాలా అరుదు. ఈ తెల్ల ఎలుకలను కర్ణి మాతకు చిహ్నంగా భావిస్తారు.

వాటి దర్శనం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుందట. ఏ భక్తుడికైనా తెల్ల ఎలుకను చూస్తే అతని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం అని అంటున్నారు. కర్ణిమాత ఆలయం భారతదేశం నుంచి మాత్రమే కాదు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుందట. ఈ ఆలయం దాని ప్రత్యేక అనుభవం, ప్రత్యేక మత సంప్రదాయం కారణంగా విదేశీ పర్యాటకులలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయ నిర్మాణం రాజస్థానీ శైలిలో జరిగింది. దీనిలో అందమైన చెక్కడాలు, పాలరాయి పని తీరు చూడ ముచ్చటగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారాలు వెండితో తయారు చేయబడ్డాయట. వాటిపై దేవతలు, దేవుళ్ళకు సంబందించిన పౌరాణిక కథల అందమైన చెక్కడాలు ఉన్నాయి. ఈ ఆలయంలో రోజుకు అనేకసార్లు హారతి, భజనలు నిర్వహిస్తారు. ఇందులో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. కర్ణిమాత ఆలయం కేవలం ఆద్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు. రాజస్థాన్ కి చెందిన గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుందట.