The Will of God: ప్రపంచంలో ప్రతీది భగవత్ సంకల్పమే..

నేను లేకపోతే ఎలా?’ అని. సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు. అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది.

Published By: HashtagU Telugu Desk
Everything In The World Is The Will Of God.

Everything In The World Is The Will Of God.

The Will of God : అశోక వనంలో రావణుడు.. సీతమ్మ వారి మీద కోపంతో.. కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు.. హనుమంతుడు అనుకున్నాడు. “ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని.. రావణాసురుని తలను ఖండించాలి” అని. కానీ మరుక్షణంలోనే మండోదరి.. రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! ఆశ్చర్య చకితుడయ్యాడు. “నేనే కనుక ఇక్కడ లేకపోతే.. సీతమ్మను రక్షించే వారెవరు.. అనేది నా భ్రమ అన్నమాట” అనుకున్నాడు హనుమంతుడు!

బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం, ‘నేను లేకపోతే ఎలా?’ అని. సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు. అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది. “ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో.. వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు” అని. మరింత ముందుకు వెళితే త్రిజట.. తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ.. దాన్ని నేను చూశాను.. అనీ చెప్పింది.

అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం.. అనుకున్నాడు. అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను.. అని చెప్పింది.

హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు.. తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది.. అనుకున్నాడు. హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు.. హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి ‘అన్నా! దూతను చంపటం నీతి కాదు’ అన్నాడు. అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని పై ఉంచాడు అని.

ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే.. విభీషణుడు ఆ మాట చెప్పగానే.. రావణుడు ఒప్పుకుని ‘కోతిని చంపొద్దు. కోతులకు తోకంటే మహా ఇష్టం. తోకకు నిప్పు పెట్టండి’ అన్నాడు. అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. “ప్రభువు నాకే చెప్పి ఉంటే.. నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి!” ఆలోచనల వరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు.

పరమాశ్చర్యం ఏంటంటే.. వాటన్నిటికే ఏర్పాట్లు.. రావణుడే స్వయంగా చేయించాడు. అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు.. తనకు ”లంకను చూసి రా” అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది! అందుకే ప్రియ భక్తులారా! ఒకటి గుర్తుంచుకోండి. ప్రపంచంలో జరుగుతున్నదంతా భగవంతుని సంకల్పానుసారంగానే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం. అందువల్ల.. నేను లేకపోతే ఏమవుతుందో!!! అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు..

Also Read:  Tirumala – Mada Street: తిరుమల – మాడ వీధి అంటే ఏమిటి..?

  Last Updated: 02 Apr 2023, 11:05 PM IST