Cow Funeral: గోమాతకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు… దశదిన కర్మ కూడా..!

భరత భూమి అంటేనే విభిన్న జాతులు, విభిన్న మతాలు కులాల సమ్మేళనం. ఇక్కడ అనేక వర్గాల ప్రజలు జీవిస్తున్నా ఒకర్ని మరొకరు గౌరవించుకుంటూ ఉంటారు.

  • Written By:
  • Updated On - February 14, 2023 / 11:54 AM IST

Cow Funeral: భరత భూమి అంటేనే విభిన్న జాతులు, విభిన్న మతాలు కులాల సమ్మేళనం. ఇక్కడ అనేక వర్గాల ప్రజలు జీవిస్తున్నా ఒకర్ని మరొకరు గౌరవించుకుంటూ ఉంటారు. అలాగే భారతీయుల అనేక రకాల ఆచార సంప్రదాయాల్ని పాటిస్తూ ఉంటారు. అందుకే ఈ గడ్డను భిన్నత్వంలో ఏకత్వం అంటారు. మనదేశ ప్రజలు అనేక రకాల జంతువుల్ని పశువుల్ని కూడా పూజిస్తుంటారు. మూగజీవాల్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు.

భారతదేశంలో గో పూజకు ఉన్న ప్రత్యేక అందరికీ తెలిసిందే. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పూజను చేస్తారు. పల్లెల్లో పండులకి, ప్రత్యేక రోజుల్లో వాటికి శుభ్రంగా స్నానం చేయించి, బొట్లు పెట్టి ఆరాధిస్తారు. ఇంకా చెప్పాలంటే గోమాతను దేవతగా భావిస్తారు. అయితే ఆ జీవాలు మృతిచెందితే కూడా తమ కుటుంబ సభ్యుడుగానే భావించి అంత్యక్రియలు… దహన సంస్కరాలు లాంటివి చేస్తుంటారు. అలా ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరులో ఒక రైతు తన ఆవుకు అంత్యక్రియలు నిర్వహించాడు.

తన  ఇంట్లో 21 సంవత్సరాల పాటు పెరిగిన ఆవు మృతి చెందటంతో దానికి అంత్యక్రియలు నిర్వహించటమే కాకుండా దశదిన కర్మను కూడా జరిపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన రైతు రెడ్డి సత్తిబాబుకు అరుదైన పుంగనూరు జాతికి చెందిన ఆవు దూడ ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పశువుల అందాల పోటీలు జరిగినా ఆ పుంగనూరు ఆవుదే మొదటి బహుమతి. పాల పోటీల్లో కూడా తనదే పైచేయిగా ఉండేది. 21 సంవత్సరాల వయసున్న ఈ పుంగనూరు 14 సంవత్సరాల పాటుగా వందలాది ఆవుల సంతతికి దోహదపడింది. అటువంటి అరుదైన ఆవు తెలుగు రాష్ట్రాలలో జరిగిన పశువుల అందాల పోటీలు,పాల పోటీలలో ఎన్నో బహుమతులు సాధించి రైతుకు ఎంతో గుర్తింపు తెచ్చింది.

అయితే ఈ  అవు  ఫిబ్రవరి 3న మృతి చెందింది. దీంతో రైతు కుటుంబం ఆవుకు శాస్త్రోక్తంగా కర్మకాండలు జరిపించారు. అలాగే తన మకాం వద్ద ఆవు చిత్ర పటంతో పూజలు నిర్వహించి అనంతరం వందలాది మంది బంధుమిత్రులు, రైతులకు భోజనాలు ఏర్పాటు చేశారు. తమ గ్రామానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఈ గోవు మృతి చెందడంతో తామంతా తీవ్ర విషాదంలోకి వెళ్లామన్నారు రైతు సత్తిబాబు. తమ కుటుంబ సభ్యులు మృతిచెందినట్లుగానే భావించి ఈ దశదినకర్మలు నిర్వహించామని ఆయన తెలిపారు.