ఒక వ్యక్తి జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని నడుస్తుంటే వృత్తి వ్యాపారాలలో తీవ్ర ఆటంకాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇలాంటప్పుడు శని త్రయోదశి రోజున చేసే చిన్న చిన్న పూజలతో ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు మరి ఈ సందర్భంగా నూతన సంవత్సరములు ఏఏ రాశులకు శని ప్రభావం ఉండబోతోంది? శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది? అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే ఆ రోజును శని త్రయోదశి అంటారు. డిసెంబర్ 28వ తేదీ శనివారం త్రయోదశి తిథి కలిసి వచ్చాయి. కాబట్టి ఆ రోజున శని త్రయోదశి పూజ చేసుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
డిసెంబర్ 28వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటలలోపు శని త్రయోదశి పూజ చేసుకోవాలి. శని త్రయోదశి రోజున శని దేవుడికి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వలన ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా శనివారానికి అధిపతి శనీశ్వరుడు. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ కర్మ ఫలితాలను అందించే అధికారం శనిది. అందుకే మానవులకు మంచి ఫలితాలు అయినా, చెడు ఫలితాలు అయినా కలిగేది శని భగవానుని అనుగ్రహం వల్లనే. నిజానికి శని పాప గ్రహం అంటారు. కానీ ఒక వ్యక్తిని అగ్ని పరీక్షలకు గురి చేసి చెడు మార్గం నుంచి సన్మార్గం వైపు నడిపించేది శని భగవానుడే. అందుకే శని దేవుని ఆరాధనకు అంతటి విశిష్టత ఉంది. జాతకం ప్రకారం ఏలినాటి శని, అష్టమ శని అర్ధాష్టమ శని నడుస్తున్న వారు తప్పకుండా శని త్రయోదశి పూజలు చేసుకోవడం వలన శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చట.
కొత్త సంవత్సరంలో శని మీన రాశిలోకి ప్రవేశిస్తున్నందున మీన రాశి, మేష రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉండబోతోంది. అలాగే కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం చివరి దశలో ఉంది. కాబట్టి ఈ మూడు రాశుల వారు శని త్రయోదశి రోజు శనికి ప్రత్యేక పూజలు జరిపించుకోవడం వలన కొత్త సంవత్సరంలో శుభ ఫలితాలను పొందుతారని చెబుతున్నారు. ఇందుకోసం శని త్రయోదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లాలి. తర్వాత అక్కడ ఉన్న నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ప్రధానంగా శనీశ్వరుని ఆరాధించడం తైలాభిషేకం చేయడం లాంటివి చేయాలట. ఒక తమలపాకులో బెల్లం ఉంచి శనికి నైవేద్యంగా సమర్పించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయట. అంతే కాకుండా ఈ రోజు నల్ల నువ్వులు, నల్లని వస్త్రంలో ఉంచి తాంబూలం, దక్షిణతో బ్రాహ్మణులకు దానం చేస్తే జాతకంలో అరిష్టాలు ఉంటే తొలగిపోయి సర్వశుభాలు చేకూరుతాయని చెబుతున్నారు.
శని త్రయోదశి రోజు ఇలా చేయడానికి కుదరని వారు కనీసం నవగ్రహాల వద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి, శనిదేవుని తమలపాకులో బెల్లం నైవేద్యంగా సమర్పించి, 9 ప్రదక్షిణలు చేస్తే శని దేవుని ప్రీతిని పొందవచ్చట. అలాగే శివునికి కానీ, ఆంజనేయస్వామికి కానీ భక్తితో 11 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహాన్ని పొందినట్లే అని చెబుతున్నారు. అలాగే ఈ రోజు శనిదేవుని వాహనమైన కాకులకు ఆహారం పెట్టడం, నల్ల చీమలకు పంచదార పెట్టడం చేస్తే కూడా మంచి జరుగుతుందట. శని త్రయోదశి రోజు రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేస్తే శని దోషాలు తొలగిపోతాయట. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామిని దర్శించి పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.