గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం (Edupayala Temple) పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద తాకిడికి ఆలయాన్ని చుట్టుముట్టిన మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆలయానికి వెళ్లే రహదారులు, ప్రాంగణం మొత్తం జలమయమైంది. భక్తుల భద్రత దృష్ట్యా అధికారులు ఐదు రోజులుగా ఆలయాన్ని మూసివేశారు. వరద ప్రభావం తగ్గేవరకు భక్తులకు అనుమతి ఉండదని అధికారులు తెలిపారు.
Jr NTR Fans: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను టీడీపీ నుండి సస్పెండ్ చేయాలి – ఫ్యాన్స్ డిమాండ్
ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీరా నదిలో వరద ప్రవాహం మరింత పెరిగింది. వరద ఉధృతికి గర్భగుడిలోకి ప్రవేశించిన మంజీరా జలాలు అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తున్నాయి. ఆలయం పూర్తిగా నీట మునగడంతో ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు వరద ముంపును చూసి ఆందోళన చెందుతున్నారు.
ప్రతి సంవత్సరం భారీ వర్షాల సమయంలో మంజీరా నది పొంగి ఆలయాన్ని చుట్టుముట్టడం పరిపాటి. అయినప్పటికీ ఈసారి వరద తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. త్వరలోనే వరద ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.