Site icon HashtagU Telugu

Dussehra:గాయత్రిదేవిగా అమ్మ‌వారు.. నైవేద్యం ఏం చేయాలంటే..?

Durga Temple

Durga Temple

విజ‌య‌వాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రిదేవిగా అమ్మ‌వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ముక్త, విద్రుమ, హేమ, నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుండడంతో భక్తులు అమ్మవారి ఆలయానికి పోటెత్తారు. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయంసంధ్యలో సరస్వతిగానూ ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటుంది. నేడు శ్రీ గాయత్రీదేవి అమ్మవారికి గచ్చకాయ రంగు చీరతో అలంకరణ చేస్తారు.

ఈ రూపంలో అమ్మవారి స్వ‌రూపం చంద్రబింబం వలె ఆమె నుదిటిని అలంకరించబడి ఉంటుంది. అమ్మవారి తెల్లటి పూలతో పూజిస్తారు. గాయత్రి దేవి అనుగ్రహంతో జీవితంలో అన్నపానాలను ఎటువంటి ఢోకా ఉండదని భక్తుల నమ్మకం. ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నం, పాయసం, అల్లపు గారెలు నేవెద్యంగా స‌మ‌ర్పిస్తారు. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేసి, గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి.

గాయత్రీ మాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని మ‌న పురాణాలు పేర్కొన్నాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. ‘‘ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యసధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌’’ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానిస్తే అంతా మంచే జరుగుతుందని భ‌క్తులు న‌మ్మ‌కం.

Exit mobile version