Tulasi Plant: తులసి మొక్కను తుంచుతున్నారా.. అయితే ఒక్క నిమిషం ఇది తెలుసుకోండి?

  • Written By:
  • Updated On - March 5, 2024 / 01:53 PM IST

హిందూ ధర్మంలో తులసి మొక్కను పరమపవిత్రంగా భావించడంతోపాటు ఇంటి ఆస్తిగా కూడా పరిగణిస్తారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా తులసి మొక్కకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారని విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి తులసి మొక్కను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల తులసి దేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో సానుకూలత వస్తుంది. తులసి మొక్కను ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో ఉంచాలి. దీని ద్వారా భగవంతుని అనుగ్రహం మనపై ఉంటుంది. దీనితో పాటు ఉదయాన్నే తులసి మొక్కకు నీరు సమర్పించడం వల్ల విష్ణువు ప్రసన్నుడవుతాడు.

అయితే అంతా బాగానే ఉంది కానీ చాలామంది తులసి మొక్కకు పూజ చేసేటప్పుడు అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటారు. తులసి మొక్క మీద చేయి వేసి ఎప్పుడు పడితే అప్పుడు, ఆకులు తుంచడం కూడా మంచిది కాదు. వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్కను పెట్టుకోవాలనుకునేవారు తూర్పు దిశలో పెట్టాలి. ఇంకా ఈశాన్యం దిశలో తులసి మొక్కను పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తరం దిశలో కూడా తులసి మొక్కను పెట్టుకోవచ్చు. ఇక ఇదే సమయంలో తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు కూడా అందించాలి. తులసి ఆకుల మాల విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది కావడంతో చాలామంది తులసి ఆకులతో మాలలల్లి విష్ణువుకు సమర్పిస్తారు. అయితే ఇలా తులసి ఆకులను తెంపేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి.

తులసి ఆకులు తెంపే సమయంలో జాగ్రత్త నియమాలు పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు తులసి ఆకులను తెంపి పొరపాటు చేస్తే జీవితంలో అనేక రకాల సమస్యలు వచ్చి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తులసి ఆకులను తెంపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే, దరిద్రం పట్టుకొని వదలకుండా వేధిస్తుంది. మరి తులసి ఆకుల్ని తెంపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూస్తే.. పొరపాటున కూడా స్నానం చేయకుండా తులసి ఆకులను ముట్టుకోకూడదు. స్నానం చేసిన తర్వాత, లక్ష్మీదేవిని ధ్యానం చేసి, నమస్కరించి, తులసి ఆకులను తెంచడానికి తల్లి అనుమతిని కోరి ఆపై ఒక్కొక్క ఆకుగా తులసి ఆకులను తెంచాలని సూచించబడింది. మాంసాహారం భుజించి పొరపాటున కూడా తులసి మొక్క పైన చెయ్యి వేయకూడదు.

అంతేకాదు పొరపాటున కూడా ఆదివారం రోజు, ఏకాదశి రోజు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రోజులలో తులసి ఆకులను పొరపాటున కూడా తెంచకూడదు. సూర్యాస్తమయం తర్వాత కూడా తులసి ఆకులను ఎట్టి పరిస్థితులలోనూ తెంచకూడదు. ఒకవేళ అలా సూర్యాస్తమయం అయిన తర్వాత తులసి ఆకులను తెంచితే అది అశుభమైందిగా పరిగణించబడుతుంది. తులసి ఆకులను తెంచేటప్పుడు చేతితో తెంచాలి కానీ గోళ్ళతో తులసి ఆకులను గిల్లకూడదు. ఒకవేళ అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.