Dog Temple: భారతదేశంలో ఆధ్యాత్మికతకు కొదువ లేదు. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర, నమ్మకం ఉంటాయి. సాధారణంగా మనం గుడిలో దేవుళ్లను పూజిస్తాం. కానీ కర్ణాటకలోని ఒక వింత ఆలయంలో మాత్రం కుక్కలను దైవంగా భావించి పూజిస్తారు. దానికి గల ఆసక్తికరమైన కారణాలు ఇక్కడ ఉన్నాయి.
కుక్కల కోసం ప్రత్యేక ఆలయం.. ఎక్కడ ఉంది?
ఈ వింతైన కుక్కల గుడి కర్ణాటకలోని రామనగర జిల్లా, చన్నపట్న పట్టణానికి సమీపంలో ఉన్న అగ్రహార వలగెరెహల్లి గ్రామంలో ఉంది. స్థానికులు దీనిని కన్నడ భాషలో ‘నాయి దేవస్థాన’ (నాయి అంటే కుక్క) అని పిలుస్తారు.
ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికర కథ
ఈ ఆలయం వెనుక ఒక ఆశ్చర్యకరమైన కథ ప్రచారంలో ఉంది. గ్రామంలో ప్రధాన దేవత అయిన కెంపమ్మ దేవి ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో రెండు కుక్కలు అక్కడకు వచ్చి ఉండటం ప్రారంభించాయి. ఆ కుక్కలు ఆలయ నిర్మాణ పనులను కాపలా కాస్తున్నట్లుగా ఉండేవని స్థానికులు నమ్ముతారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ రెండు కుక్కలు అకస్మాత్తుగా మాయమయ్యాయి. ఊరంతా వెతికినా అవి ఎక్కడా కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత కెంపమ్మ దేవి గ్రామస్తులలో ఒకరి కలలోకి వచ్చి.. ఆ రెండు కుక్కలు తన రక్షకులని, వాటి కోసం తన ఆలయానికి సమీపంలోనే ఒక గుడి కట్టాలని ఆజ్ఞాపించింది. అమ్మవారి ఆదేశం ప్రకారం.. 2010లో రమేష్ అనే వ్యాపారవేత్త సహాయంతో గ్రామస్తులు ఆ రెండు కుక్కల విగ్రహాలను ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు.
Also Read: KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం
పూజా విధానం, నమ్మకాలు
గ్రామ రక్షణ: ఈ కుక్కలు తమ గ్రామాన్ని ప్రతికూల శక్తుల నుండి కాపాడతాయని, గ్రామానికి కాపలాగా ఉంటాయని ప్రజలు బలంగా నమ్ముతారు.
తొలి పూజ: విశేషమేమిటంటే ఏ పండగ వచ్చినా గ్రామ దేవత కెంపమ్మ కంటే ముందే ఈ కుక్కలకే తొలి పూజ నిర్వహిస్తారు.
దొంగతనాల నుండి విముక్తి: ఇంట్లో దొంగతనం జరిగినవారు ఇక్కడ పూజ చేస్తే, దొంగలు దొరుకుతారని, వారికి శిక్ష పడుతుందని భక్తుల నమ్మకం.
విశిష్ట రోజులు: ప్రతి ఆదివారం, సోమవారం, గురువారాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఏటా ఈ గ్రామస్తులు కుక్కల గౌరవార్థం ఒక పెద్ద ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తారు.
