Dussehra Festival: అస‌లు ద‌స‌రా పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. ఆశ్వయుజ మాసంలో మొదటి తొమ్మిది రోజులను శరన్నవరాత్రులు అంటారు.

Published By: HashtagU Telugu Desk
Dussehra Imresizer (1)

Dussehra Imresizer (1)

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. ఆశ్వయుజ మాసంలో మొదటి తొమ్మిది రోజులను శరన్నవరాత్రులు అంటారు. అయితే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని తొమ్మది రూపాల్లో అలంకరిస్తారు. అలానే ఈ తొమ్మిది రోజుల్లో ప్రతీరోజు కూడా వివిధ పదార్ధాలతో నివేదన చేస్తారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు.

ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు.

పూర్వ కాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషము అంటే అర్ధం దున్నపోతు. దున్నపోతు ఆకారంలో అతను ఉండటం వల్ల అలా పిలిచేవారు. ముల్లోకాలను జయించాలనే దుర్బుద్ధిని కలిగి ఉండడంతో.. తన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుంటాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావటం వల్ల ఒక వరాన్ని పొందుతాడు. అదే ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా ఉండాల‌నే వ‌రం కోరుతాడు. ఇలా వ‌రం పొందిన క్ష‌ణం నుంచి దేవతలను, ప్రజలను హింసించ‌డం మొద‌లుపెట్టాడు. ఇది గమనించిన త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు ఒక స్త్రీ శక్తి రూపాన్ని సృష్టించారు.

వారు సృష్టించిన ఆ శక్తియే దుర్గామాతగా అవతరించింది. 18 చేతులు గల దుర్గాదేవి ఇంద్రుడి నుండి వజ్రాయుధం, విష్ణువు నుండి సుదర్శన చక్రం, శివుడి నుండి త్రిశూలాన్ని ఆయుధాలుగా సింహాన్ని వాహనంగా పొందింది. 9 రోజులు దుర్గాదేవి మహిషాసురుడితో యుద్ధం జరిపి అతన్ని సంహరించింది. కాబట్టి ఆ 9 రోజులను దేవీనవరాత్రులుగా 10వ రోజును విజయానికి చిహ్నంగా విజయదశమి జరుపుకుంటున్నాం.

  Last Updated: 02 May 2023, 11:57 AM IST