Site icon HashtagU Telugu

Simhachalam Appanna Swamy: సింహాచలం అప్పన్న స్వామికి చందనం ఎందుకు ప్రీతికరమో తెలుసా?

Do You Know Why Sandalwood Is Loved By Simhachalam Appanna Swami..

Do You Know Why Sandalwood Is Loved By Simhachalam Appanna Swami..

Simhachalam Appanna Swamy : “సింహాచలం” శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై వున్న ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం.సింహాచలం అప్పన్న స్వామి మహిమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మన రాష్ట్రాలలో ఉన్న మిగతా నరసింహస్వామి ఆలయాలలో కన్నా ఈ సింహాచలంలో (Simhachalam) ఉన్న ఆలయం ఎంతో భిన్నంగా ఉంటుంది.అన్ని ఆలయాలలో మనకు స్వామి వారి విగ్రహ రూపంలో దర్శనమిస్తే సింహాచలంలో మాత్రం లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు.

అదే విధంగా ఈ ఆలయంలో ఉన్న లింగరూప లక్ష్మీనరసింహస్వామి ఎల్లప్పుడు చందనంతో నిండుగా పూయబడి ఉంటుంది. అసలు ఈ ఆలయంలో స్వామి వారు ఎందుకు లింగరూపంలో ఉన్నారు?? ఇక్కడ ఉన్న స్వామివారికి చందనం ఎందుకింత ప్రీతికరమో?? ఇక్కడ తెలుసుకుందాం..

మన పురాణాల ప్రకారం విష్ణు భక్తుడైన ‘ప్రహ్లాదుడు’ సింహాచలంలోని నవ నరసింహ స్వామిని ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. సింహాచలంలో “నరసింహస్వామి”ని ప్రతిష్టించినది ప్రహ్లాదుడు అని పురాణాలు చెబుతున్నప్పటికీ,ఆలయాన్ని నిర్మించినది మాత్రం ‘పురూరవుడ’నే రాజు నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి.

ఒకరోజు పురూరవుడు సింహాచలం (Simhachalam) ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో అక్కడ నేలలో కప్పబడి పోయిన స్వామి వారి విగ్రహం బయటపడింది. ఆ సందర్భంగా ఆ రాజు స్వామి వారి కోసం సింహాచలంలో ఆలయం నిర్మించారని తెలుస్తోంది.

అదే సమయంలోనే ఆకాశవాణి ఆ రాజుకు ప్రతి రోజు స్వామివారికి చందనం పూత పూయాలని చెప్పగా, ఆకాశవాణి పలుకుల మేరకు అప్పటి నుంచి స్వామివారిని నిత్యం చందనంతో అలంకరిస్తారు. అలా అప్పట్లో మొదలైన ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

కేవలం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే స్వామివారికి చందనం పూత ఉండదు. మిగిలిన రోజులన్నీ స్వామివారు చందనం పూతతోనే భక్తులకు దర్శనమిస్తారు.సింహాచలంలోని వరాహ నరసింహుడిని నిరంతరం చందనంతో కప్పి వుంచుతారు.విగ్రహం వేడిగా వుంటుందని అంటారు. ఆ వేడిని ఉపశమింపజేయడానికి నిరంతరం చందనం లేపనంగా పూస్తూ వుంటారని చెబుతారు.

ఏడాదిలో వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే చందనాన్ని పూర్తిగా తొలగించి, కేవలం 12 గంటల సమయం మాత్రమే స్వామివారి నిజస్వరూపాన్ని చూసే అవకాశాన్ని భక్తులకు కలిగిస్తారు. దీనిని “చందనోత్సవం” లేదా ‘చందనయాత్ర’ అని పిలుస్తారు. సింహాచల క్షేత్రానికి (Simhachalam) సంబంధించి ఇది చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక ఉత్సవం.

చందనోత్సవానికి కొద్ది రోజుల ముందే ఈ ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ దేవాలయంలోని పూజారులు స్వామివారికి కొత్త చందనపు లేపనం కోసం గంధపు చెక్కలను అరగదీయడం ప్రారంభిస్తారు. ఇలా అరగదీసిన చందనాన్నే 12 గంటల నిజరూప దర్శనం ముగిసిన తర్వాత స్వామివారికి లేపనంగా పూస్తారు. చందనోత్సవం రోజున స్వామివారి నిజరూప దర్శనం చేసేందుకు వేలాదిమంది భక్తులు ఆలయానికి వస్తారు.

ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినే నమః

Also Read:  CRPF Exams: ఇక ఆ ఎగ్జామ్స్ తెలుగులోనూ.. కేంద్ర సర్కారు కీలక నిర్ణయం