హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టినా కూడా అందులో మొదటి పూజ విగ్నేశ్వరుడికి చేస్తూ ఉంటారు. విజ్ఞాలకు అధిపతి అయిన విగ్నేశ్వరుడికి తొలి పూజ చేసిన తరువాతనే మిగతా పూజా కార్యక్రమాలు పనులు మొదలు పెడుతూ ఉంటారు. మొదటి పూజ ఆయనకే. అయితే విఘ్నేశ్వరుడి పూజలో మనం ఎన్ని రకాల పూలు పండ్లు ఉపయోగించినప్పటికీ గరికను పెట్టకపోతే ఆయన తృప్తి చెందడు. మరి ఇంతకీ గరిక అంటే ఎందుకు ఆయనకు అంత ఇష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
దీని వెనుక ఒక కథ ఉంది. ఇంతకీ ఆ కథ ఏమిటి అన్న విషయాన్ని వస్తే..ఒకప్పుడు అనలాసురుడు అనే రాక్షసుడు దేవతలను, ఋషులను భయపెట్టడం ప్రారంభించాడు. అతను చేసే దౌర్జన్యానికి యావత్ సృష్టి నివ్వెరపోయింది. ఈ సమస్యను పరిష్కరించమని దేవతలు వినాయకుడిని ప్రార్థించారు. అప్పుడు వినాయకుడు అనలాసురుడిని చంపడానికి అతన్ని మింగేశాడు. కానీ అనలాసురుడి శరీరం వల్ల కలిగే తీవ్రమైన వేడి కారణంగా వినాయకుడు భరించలేని బాధను అనుభవించాడు. ఈ నొప్పిని తగ్గించడానికి ఋషులు గరిక గడ్డిని ఉపయోగించారు. వినాయకుడి శరీరంపై గరికను ఉంచారట.
అలా ఉంచిన వెంటనే మంట, నొప్పి తగ్గిపోయిందట. దీంతో సంతోషించిన వినాయకుడు తనకు గరిక గడ్డి సమర్పించిన భక్తులకు అన్ని అడ్డంకులు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని వరం ఇచ్చాడట. అప్పటి నుండి వినాయక పూజలో గరికకు ముఖ్యమైన స్థానం ఏర్పడింది. అలా అప్పటి నుంచి ఆయనకు గరికను సమర్పిస్తూ వస్తున్నారు. కాబట్టి విఘ్నేశ్వరుడిని పూజించేవారో ఆయనకు ఎలాంటి నైవేద్యాలు సమర్పించినా, సమర్పించకపోయినా గరికను మాత్రం తప్పనిసరిగా సమర్పించాలని చెబుతున్నారు.