Gundla Brahmeswaram Temple : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు మండల పరిధిలో, నల్లమల అడవుల మడిలో ఒక పవిత్రమైన అందరికీ అందుబాటులో లేని దేవాలయం ఉంది. అదే గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఏడాదికి కేవలం రెండు రోజులు మాత్రమే భక్తులకు తెరిచి ఉంచుతారు. మహాశివరాత్రి సందర్భంగా మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ ఆలయం ప్రాచీన చరిత్ర కలిగినది. శిలాశాసనాల ప్రకారం, దీనిని కాకతీయులు మరియు విజయనగర రాజులు పునర్నిర్మించారు. ఇక్కడ పరమేశ్వరుడు బ్రహ్మేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. స్థల పురాణం ప్రకారం, మహాభారత యుద్ధం అనంతరం అశ్వత్థాముడు శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు, తన పాపప్రక్షాళన కోసం గుండ్లకమ్మ నదీతీరాన శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. భక్తుల నమ్మకం ప్రకారం ఇది అతని జన్మస్థానమైన ప్రాంతం.
Read Also: TATA NANO : మార్కెట్లోకి టాటా నానో సరికొత్త వెర్షన్..ఈసారి అస్సలు తగ్గెదేలే..
ఈ ఆలయంలో శివుడు మాత్రమే కాకుండా రాజరాజేశ్వరి దేవి, అశ్వత్థామ, వీరభద్ర స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు కూడా దర్శనమిస్తారు. అయితే, భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే అటవీ అధికారుల అనుమతి తప్పనిసరి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సమయంలో మాత్రమే రెండు రోజులపాటు భక్తులకు అనుమతి ఇస్తారు. ఈ పుణ్యక్షేత్ర దర్శనం ఒక ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు. ఇది ప్రకృతి ప్రేమికులకూ ఒక స్వర్గధామం. దట్టమైన నల్లమల అడవిలో 353కు పైగా వృక్షజాతులు, పులులు, దుప్పులు, మచ్చలపిల్లి తదితర వన్యప్రాణులు కనిపిస్తాయి. అటవీ శాఖ లెక్కల ప్రకారం, ప్రస్తుతం ఈ ప్రాంతంలో 23 పులులు సంచరిస్తున్నాయి. అందుకే దీనిని పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు.
ఆలయానికి చేరాలంటే, ముందుగా నంద్యాల జిల్లా వెలుగోడు చేరాలి. అక్కడి నుంచి గట్టుతండా మీదుగా ట్రాక్టర్లు, జీపులు తదితర వాహనాల్లో గుండ్ల బ్రహ్మేశ్వర క్షేత్రానికి ప్రయాణించవచ్చు. గతంలో ఆర్టీసీ బస్సులు కూడా వచ్చేవి. కానీ, తెలుగుగంగ రిజర్వాయర్ నిర్మాణం, పులుల సంరక్షణ నేపథ్యంలో వాహన మార్గాన్ని మూసివేశారు. ఇప్పుడు సంవత్సరానికి రెండు రోజులే అనుమతి ఇస్తున్నారు. ప్రయాణానికి పరిమితులు కూడా ఉన్నాయి. ఉదయం 6 గంటల లోపు బయలుదేరి, సాయంత్రం 6 గంటల లోపు తిరిగి రావాల్సిందే. అనుమతి ఆ పరిమితిలోనే ఉంటుంది. నంద్యాల నుంచి గాజులపల్లె గిద్దలూరు దిగువమెట్టు మార్గంలో కూడా ఆలయానికి చేరుకోవచ్చు. ఇది సుమారుగా 42 కిలోమీటర్లు.
గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయం సమీపంలో ప్రవహించే గుండ్లకమ్మ నది, నంద్యాల నుంచి ప్రారంభమై ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాలను తడుపుతుంది. ఈ నదిపై నిర్మించిన కందుల ఓబుళరెడ్డి గుండ్లకమ్మ జలాశయం, ప్రకాశం జిల్లాలోని అనేక గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందిస్తోంది. ఇప్పటికీ చాలామంది భక్తులు ఆలయం రెగ్యులర్‌గా తెరచాలని కోరుకుంటున్నప్పటికీ, అటవీ శాఖ అధికారులు మాత్రం పులుల సంరక్షణ దృష్ట్యా ఏడాదిలో కేవలం రెండు రోజులు మాత్రమే అనుమతిస్తున్నారు. ఒకప్పుడు కార్తీకమాసం, మాఘమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అది గుర్తుగా మాత్రమే మిగిలింది. గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అంటే భక్తి, ప్రకృతి, పౌరాణికత ఇవన్నింటి సమ్మేళనం. అందుకే ఇది ఆధ్యాత్మిక గమ్యం మాత్రమే కాక, ప్రకృతి ప్రేమికులకూ ఒక ప్రత్యేక అనుభూతి.