Site icon HashtagU Telugu

Friday: శుక్రవారం రోజు లక్ష్మి దేవికి నైవేద్యం పెడుతున్నారా.. అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు అంటే ఇష్టము మీకు తెలుసా?

Friday

Friday

శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈరోజున లక్ష్మీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. అయితే అమ్మవారిని పూజించేటప్పుడు చాలా మంది రకరకాల ప్రసాదాలు సమర్పిస్తూ ఉంటారు. కానీ అమ్మవారికి ఎటువంటి ప్రసాదం అంటే ఇష్టం అన్నది మనలో చాలామందికి తెలియదు. ఇంతకీ లక్ష్మీదేవికి శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి? అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు అంటే ఎక్కువగా ఇష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంట్లో నిత్య దీపారాధన చేసేవారు ఎలాంటి నైవేద్యాలు చేయాలి అన్న విషయాన్ని వస్తే.. పటిక బెల్లం, అరటి పండ్లు, బెల్లం, కొబ్బరికాయ,ఎండు ద్రాక్ష,పచ్చిపాలు, తేనె, వడపప్పు, పానకం వంటివి నివేదిస్తే సరిపోతుందని చెబుతున్నారు. వీటికి ఎలాంటి దోషం ఉండదట. వీటినే అవసర నైవేద్యాలు అని అంటారని చెబుతున్నారు పండితులు. అలాగే పర్వదినాల్లో, ద్వాదశి వంటి విశేష తిథుల్లో మడిగా తయారు చేసిన పంచభక్ష్య పరమాన్నాలతో దేవుడికి నైవేద్యం పెట్టడం హిందూ సంప్రదాయం అన్న విషయం తెలిసిందే. దేవునికి మహా నైవేద్యం కోసం తయారు చేసే పదార్ధాలను ముందుగా రుచి చూడకూడదట. చాలా నిష్టగా మనసులో అన్న పూర్ణాష్టకం చదువుకుంటూ వంట చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఎట్టి పరిస్థితులలో దేవుడికి నైవేద్యం సమర్పించకుండా దానిని రుచి చూడడం, ఎంగిలి చేయడం లాంటివి అస్సలు చేయకూడదట. ఇకపోతే కొందరి ఇంట్లో ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషమైన నైవేద్యం సమర్పిస్తుంటారు. ఇలా శుక్రవారాలు అమ్మవారి కోసం ప్రత్యేక నైవేద్యాలు సమర్పించే వారు లలితా సహస్రనామంలో చెప్పిన అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు సమర్పిస్తే మంచి జరుగుతుందట. అమ్మవారి నైవేద్యాలతో గుడాన్న నివేదనకు అత్యధిక ప్రాధాన్యం ఉందట. గుడము అంటే బెల్లం, అన్నం అంటే బియ్యంతో వండినది అని అర్థం. గుడాన్నం అంటే బెల్లం, బియ్యం కలిపి చేసే వంట. లలితా అమ్మవారికి గుడాన్నం అంటే ప్రీతికరం అని చెబుతున్నారు.

కాగా బెల్లంకి నిలువ దోషం లేదట. అమ్మవారికి ఈ నైవేద్యం పెడితే దారిద్య్ర బాధలు తొలగిపోయి ధనధాన్యాలతో ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుందని చెబుతున్నారు. పాయసాన్నం అంటే పాలు, బియ్యానికి మధుర పదార్థం అయిన బెల్లం కానీ పంచదార కానీ కలిపి వండిన వంట. దీనినే క్షీరాన్నం అని కూడా అంటారు. ఆ తల్లికి పాయసాన్నం మీద ప్రీతి ఎక్కువట. అమ్మవారికి ఈ నైవేద్యం పెడితే ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు. పెరుగన్నం అంటే కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం అని చెబుతున్నారు. పెరుగన్నం నివేదించడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందట. అమ్మవారికి తేనే గారెలు కలిపి నివేదిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుందట. దీనివల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు. పెసరపప్పు పాయసం నైవేద్యం చేసి పెట్టవచ్చట. ఈ ప్రసాదం అమ్మవారికి సమర్పిస్తే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని చెబుతున్నారు.