Yama Deepam : ధన త్రయోదశితోనే దీపావళి పండుగ మెుదలవుతుంది. ఈసారి నవంబరు 10న ధన త్రయోదశి వస్తోంది. ఆ రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఆ రోజున ఇంటి బయట దీపాలను వెలిగిస్తారు. ధనత్రయోదశి వేళ మృత్యుదోషం తొలగిపోయేందు కోసం, పరిపూర్ణ ఆయుష్షు కోసం.. సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో లేదా పిండితో తయారు చేసిన ప్రమిదల్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని వెలిగించి దీపారాధన చేస్తారు. దక్షిణ దిక్కుకు అధిపతి యముడు. అందుకే ఇంటి ఆవరణలో దక్షిణం వైపు ధాన్యపు రాశి మీద యమ దీపాలను వెలిగిస్తారు. దీనివల్ల యముడు శాంతిస్తాడని, అకాల మరణం దరి చేరనీయడమని నమ్ముతారు. ధన త్రయోదశి రోజు తమ వారసులను అనుగ్రహించడానికి పితృదేవతలు భూమిపైకి వస్తారని అంటారు. వారికి దారిని చూపడానికి ఇంట్లో దక్షిణం వైపు దీపం పెట్టాలని చెబుతారు.
We’re now on WhatsApp. Click to Join.
- ధన త్రయోదశి తిథి నవంబర్ 10న మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ప్రారంభమై, నవంబర్ 11న మధ్యాహ్నం 1. 57 నిమిషాలకు ముగుస్తుంది.
- ప్రదోష పూజ పవిత్ర సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ధన త్రయోదశి పండుగను నవంబర్ 10న జరుపుకుంటారు.
- ధన త్రయోదశి పూజ ముహూర్తం సాయంత్రం 6 గంటల 17 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 11 నిమిషాల వరకు ఉంటుంది.
- ధన త్రయోదశి ప్రదోషకాలం సాయంత్రం 5 గంటల 39 నిమిషాల నుంచి 8 గంటల 14 నిమిషాల వరకు ఉంటుంది.
- ఈసారి లక్ష్మీ దేవికి ఇష్టమైన శుక్రవారం నాడు ధన త్రయోదశి జరుపుకోనున్నాం.
Also Read: BRS Minister: అప్పుడు తెలంగాణ ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలి!
పురాణ గాథలో ఏముంది ?
‘హిమ’ రాజుకు ఒక కొడుకు ఉంటాడు. పెళ్లి చేసిన నాలుగో రోజే కొడుకు చనిపోతాడని రాజుకు పండితులు చెబుతారు. కానీ ఒక రాజకుమారి .. హిమరాజు కొడుకును పెళ్లి చేసుకునేందుకు ముందుకు వస్తుంది. పెళ్లైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పినా ఆమె వినిపించుకోదు. తన భర్తను తానే కాపాడుకుంటానని ప్రకటిస్తుంది. పెళ్లి జరిగిన నాలుగో రోజున(ఆశ్వయుజ బహుళ త్రయోదశి).. రాకుమారుడి గది ఎదుట బంగారు నగలు, ఇతర ఆభరణాలను రాశులుగా పోసి దీపాలను వెలిగిస్తుంది. లక్ష్మీదేవికి పూజలు చేస్తుంది. ఈక్రమంలో రాకుమారుడి ప్రాణాల కోసం యముడు పాము రూపంలో వస్తాడు. అయితే నగల మీద పడిన దీపకాంతి వల్ల ఆయన కళ్లు చెదిరిపోతాయి. అప్పటికే మృత్యు ఘడియలు దాటిపోవడంతో యముడు వెనక్కి వెళ్లిపోతాడు. అప్పటి నుంచి ధన త్రయోదశి రోజు ఆభరణాలను కొనడం, లక్ష్మీదేవిని పూజించడం ఆచారంగా (Yama Deepam) వస్తోంది.