Site icon HashtagU Telugu

Telangana Amarnath: సాహసం.. సౌందర్యం.. సలేశ్వరం!

Saleshwaram

Saleshwaram

చుట్టూ అడవి..కొండలు కోనలు .. జలపాతాలు… ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే  నల్లమల్ల అటవీ ప్రాంతం… ఆ ప్రాంతంలో లోయల లో వెలసిన  లింగమయ్య దర్శనం పూర్వజన్మ సుకృతం.. అలాంటి సలేశ్వరం జాతర మొదలైంది. ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసే పరమేశ్వరుని మహా దర్శన భాగ్యం ఉగాది పర్వదినం దాటిన తర్వాత లభిస్తుంది . ఈనెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. ఆ ఉత్సవాల విశేషాలు మీకోసం..

హైదరాబాద్ కు 120 కిలోమీటర్ల దూరాన, శ్రీశైలానికి 40 కిలోమీటర్ల (నాగార్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు సమీపంలోని నల్లమల ఫారెస్ట్) సమీపాన ఉంటుంది. అడవిలో నుంచి 25 కిలోమిటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 5 కిలోమీటర్ల కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. సలేశ్వరం వెళ్లే దారిలో చెంచు గుడారాలు దాటుకుంటూ  రాళ్లు.. రప్పలు.. లోయలలో దిగి వెళ్ళాల్సిందే. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులవుతారు.  నింగి నుంచి నేలకు దిగుతున్న ఆకాశ గంగను తలపించేలా మహత్తర జలపాతం అది. ఈ ప్రకృతి రమణీయ ప్రదేశం ఒకప్పుడు సర్వేశ్వరంగా పిలువబడి ప్రస్తుతం సలేశ్వరంగా ప్రసిద్ధిగాంచింది.

వేయి అడుగుల లోతున ఉన్న లోయలోని సలేశ్వరం లింగమయ్యను భక్తులు దర్శనం చేసుకుంటారు. ‘వస్తున్నాం లింగమయ్య’ అని, తిరిగి వెళ్లేటప్పుడు ‘మళ్లీ వస్తాం లింగమయ్య’ అంటూ భక్తుల మారుమోగుతుంది. సలేశ్వరం లోయలో వేయి అడుగుల ఎత్తు నుంచి గలగల పారే జలపాతం దృశ్యం ఎంతగానో ఆకట్టుకుంటుంది. పైనుండి చల్లని నీరు ధారగా వస్తుంది. జనం పెరిగే కొద్దీ నీటిధార పెరుగుతుంది. ఈ జలపాతంలో స్నానం చేస్తే సర్వరోగాలు పోతాయని,ఆయుష్షు పెరుగుతుందని భక్తుల విశ్వాసం. ఆలయ ద్వారానికి కుడివైపున వీరభద్రడు,దక్షుడి విగ్రహాలు, ఎడమవైపున రెండు సిద్ధ విగ్రహాలు ఉన్నాయి. సలేశ్వరం యాత్ర ముగిసిన తర్వాత అతి పెద్ద పులుల సంరక్షణాకేంద్రం. టైగర్ సఫారీ పేరిట ఫారెస్ట్ చూసి రావొచ్చు.