Goddess lakshmi : లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేయండి..!!

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 06:11 AM IST

లక్ష్మీదేవి సంపదలకు దేవత. ఏ ఇంట్లో అయితే ఆనందం ఉంటుందో..అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. పరిశుభ్రత, ప్రేమను ఇష్టపడుతుంది. ఎక్కడ సానుకూలత ఉంటుందో అక్కడ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. పలు రకాల పూజలు,తపస్సుల ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని గ్రంథాలలో స్పష్టంగా పేర్కొన్నారు. రాత్ర పడుకునేముందు ఇంట్లో ఈ పనులను చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.

దేవునికి దీపం వెలిగించండి
ప్రతిఒక్కరిఇంట్లో పూజగది ఉంటుది. ప్రతిరోజూ భక్తితో పూజిస్తుంటారు. రాత్రిపడుకునేముందు కూడా పరిశుభ్రతను పాటిస్తూ దేవుడి ముందు దీపం వెలిగించాలి. కొందరు నెయ్యి దీపం కూడా వెలిగిస్తారు. ప్రతిరోజూ ఇలా సాయంత్రం కూడా దీపం వెలిగించినట్లయితే లక్ష్మీదేవి ఆశీస్సులు తప్పకుండా మీపై ఉంటాయి.దేవుడి గదిలో ఎప్పుడూ కూడా చీకటిగా ఉండకూడదు.

కర్పూరం వెలిగించండి
రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించండి. ఈ పొగను పడకగదితోపాటు ఇళ్లంతా వ్యాపించేలా చేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఇంట్లోని ప్రతికూల శక్తులు నశిస్తాయి. కర్పూర పరిమళం ఇంట్ల ప్రతిమూలకు చేరితే మంచిది. కర్పూరానికి చాలా ప్రాముఖ్యత ఉందికాబట్టి దేవుళ్ల ముందు వెలిగిస్తుంటారు. లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే కర్పూరాన్ని వెలిగించాలని పెద్దలు చెబుతుంటారు.

దీపాన్ని దక్షిణ దిశలో ఉంచండి
దీపం కాంతికి చిహ్నం. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు దక్షిణ దిక్కున దీపం వెలిగించడం మంచిదని శాస్త్రం చెబుతోంది. పూర్వీకులు దక్షిణ దిక్కున ఉంటారని నమ్ముతారు. అందుకే అక్కడ దీపం వెలిగించడం వలన మన నిష్క్రమించిన పెద్దలు సంతోషిస్తారు. దీపం వెలిగించడం కుదరకపోతే ఆ దిశలో చిన్న బల్బును వెలిగించండి. ఇలా చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.

పెద్దలకు సేవ చేయండి
ఇంట్లో పెద్దలను ఎంతో ప్రేమగా, గౌరవంగా చూసుకోవడం అందరి కర్తవ్యం. కుటుంబంలోని పెద్దల త్యాగం, కష్టాల ఫలితంగా మనం జీవిస్తున్నాము. మన జీవితంలో వారి సహకారం లేనిది మనం ముందుకు అడుగు వేయలేము. వృద్ధులను గౌరవంగా చూసుకోవాలి.  అలాంటి పనులతో లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది. ఎవరైతే తమ ఇంట్లో తల్లిదండ్రులతో సహా పెద్దలకు సేవ చేస్తారో ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు పడుకునే ముందు, పెద్దల వద్దకు వెళ్లి వారి అవసరాలను తెలుసుకోని నిద్రించాలి.

ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచండి
ఇంటి ముందు తలుపును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ప్రధాన ద్వారం గుండా ప్రవేశిస్తుంది. అందువల్ల, లక్ష్మీ దేవిని స్వాగతించడానికి ప్రవేశ ద్వారం, తలుపు శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. తలుపు ముందు చెప్పులు, బూట్లు ఉండకూడదు. అలాగే సాయంత్రం ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించాలి. ఉదయం కూడా గడపై ముగ్గురు వేసి కుంకుమతో బొట్లు పెట్టాలి.  ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని విశ్వాసుల నమ్మకం.