Site icon HashtagU Telugu

Medak Church: మెదక్‌ చర్చి నిర్మాణం వెనుక ఆసక్తికర విష‌యాలు.. ఖ‌ర్చు ఎంతో తెలుసా..?

Imgonline Com Ua Resize Kgptiel3izv 11zon

Imgonline Com Ua Resize Kgptiel3izv 11zon

అద్భుత కట్టడం.. ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా వర్థిల్లుతోంది మెదక్ చర్చి. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఠీవీగా కనిపించే ఈ చర్చిని భారతీయ, విదేశీ కళా నైపుణ్యాల మేళవింపుతో నిర్మించారు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం, శిఖరం.. వందేళ్లు పూర్తైనా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు భారతీయ పురాతన పద్ధతులను అనుసరించారు. రంగు రంగుల గాజు ముక్కలతో చర్చి లోపలి భాగంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఏసుక్రీస్తు పుట్టుక, శిలువ వేయడం, ఆరోహణం ఇవన్నీ ఈ పెయింటింగ్స్‌లో కనిపిస్తాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే.. ఇవన్నీ ఒకే గాజుపై వేసినవి కాదు. ఇంగ్లండ్‌లో గాజు ముక్కలపై విడివిడిగా పెయింటింగ్ వేసి ఇక్కడికి తీసుకొచ్చి అమర్చారు. ఇవి సూర్య కిరణాలు పడితేనే కనిపిస్తాయి. అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్యే ఈ పెయింటింగ్స్ కనిపిస్తాయి. 6 గంటల తర్వాత ఫ్లడ్ లైట్స్ వేసి వెతికినా కనిపించవు. దీని వెనుక ఉన్న సైన్స్ అందరినీ అబ్బురపరుస్తుంది.

మరో విశేషం ఏమిటంటే.. ఉత్తరం దిక్కున ఉన్న మూడో కిటికీపై అసలు సూర్య కిరణాలే పడవు. అయినా, అది ప్రకాశిస్తుంది. ఇక్కడి రాళ్లపై సూర్య కిరణాలు వక్రీభవనం చెంది ఆ కిటికీపై పడటం వల్ల ఇలా జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. చర్చి నిర్మాణంలో వాడిన మార్బుల్స్‌ను ఇంగ్లండ్, ఇటలీ నుంచి తీసుకొచ్చారు. చర్చి లోపల రీసౌండ్ రానివిధంగా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు. శాంతికి, పవిత్రతకు నిలయమైన ఈ కెథడ్రల్ చర్చ్‌కు ఇంకా అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ చర్చి నిర్మాణానికి కేవలం రాతి, డంగు సున్నాన్ని మాత్రామే వాడారు. పిల్లర్లు, భీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైన ప్రార్థనా మందిరాన్ని, శిఖరాన్ని నిర్మించడం నాటి పనితనానికి అద్దం పడుతోంది. 200 అడుగుల పొడవుతో సువిశాలమైన చర్చి చూపర్లను ఇట్టే కట్టిపడేస్తుంది.

చార్లెస్ వాకర్ అనే ఇంగ్లాండ్ దేశస్థుడు 1914లో ఈ చర్చి నిర్మాణం ప్రారంభించాడు. అది మొదటి ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయం. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో జనం సమిధలయ్యారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీనికి భారత్ కూడా మినహాయింపు కాదు. పనిలేక.. తిండిలేక, బతుకుదెరువు కష్టమై బిక్కుబిక్కుమంటూ గడిపారు. అలాంటి భయంకరమైన కరువు పరిస్థితుల్లో చార్లెస్‌ వాకర్‌ పాస్నెట్‌ కరుణామయుని కోవెల నిర్మాణం తలపెట్టారు.

గుక్కెడు మెతుకుల కోసం అల్లాడుతున్న జనానికి ఇలాగైనా కాస్త పని దొరుకుతుందనేది ఆయన ఆలోచన. 1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణం 1924 డిసెంబర్ 25న పూర్తైంది. పదేళ్ల పాటు సుమారు 12 వేల మంది కూలీలు ఈ నిర్మాణంలో పాలుపంచుకుని ఉపాధి పొందారు.