Site icon HashtagU Telugu

Margasira Pournami : మార్గశిర పౌర్ణమి గురువారం రోజున ఓ అద్భుతం జరగబోతుందట తెలుసా?

Margasira Pournami

Margasira Pournami

ఏడాదిలో వచ్చే అన్నీ పౌర్ణమిలు విశిష్టమైనప్పటికీ మార్గశిర పూర్ణిమకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే మార్గశిర పౌర్ణమిని అగహన పూర్ణిమ అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఆచరించి శ్రీమహావిష్ణువు, లక్ష్మీ దేవిని పూజించడంతో పాటు చంద్రుడిని కూడా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగుతాయని పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో మార్గశిర పౌర్ణమి 2025 తేదీ, తిథి ప్రారంభం, పూజకు శుభ ముహూర్తం తెలుసుకుందాం..

హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసంలో శుక్రవారం.. మాఘ మాసంలో ఆదివారం.. కార్తీక మాసంలో సోమవారం.. మార్గశిర మాసంలో గురువారం.. అత్యంత పవిత్రమైన, విశిష్టమైన రోజులుగా భావిస్తారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో గురువారం అంటే లక్ష్మీదేవికి ప్రతి రూపమైన శ్రీకనక మహాలక్ష్మీ అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు. అయితే.. ఈసారి వచ్చే గురువారం అంటే డిసెంబర్‌ 4వ తేదీన మార్గశిర మాసం గురువారంతో పాటు పౌర్ణమి కూడా ఇదే రోజున వచ్చింది. ఈ రోజున శ్రీమహాలక్ష్మీని, చంద్రుడిని పూజిస్తే మంచిదని అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

మార్గశిర పౌర్ణమి తిథి ప్రారంభం
హిందూ పంచాంగం ప్రకారం.. మార్గశిర పౌర్ణమి తిథి 2025 డిసెంబర్ 4వ తేదీన గురువారం ఉదయం 8.37 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజు తెల్లవారుజామున 4.43 గంటలకు పౌర్ణమి తిథి ముగుస్తుంది. కాబట్టి డిసెంబర్ 4వ తేదీన మార్గశిర పౌర్ణమి 2025 జరుపుకుంటారు. ఇదే రోజు ఉదయం 06.59 గంటల నుంచి మధ్యాహ్నం 02.54 గంటల వరకు రవియోగం ఉంటుంది. ఈ రవి యోగంలో పవిత్ర స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం.

బ్రహ్మ ముహూర్తం: ఉదయం 05.10 గంటల నుంచి ఉదయం 6.04 గంటల వరకు ఉంటుంది.
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11.50 గంటల నుంచి మధ్యాహ్నం 12.32 గంటల వరకు ఉంటుంది.
మార్గశిర పౌర్ణమి రోజు చంద్రోదయ సమయం సాయంత్రం 4.35 గంటలకు ప్రారంభమవుతుంది.
మార్గశిర పౌర్ణమి రోజు రాహుకాలం: మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3.00 గంటల వరకు ఉంటుంది.

ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు ఆచరించే మార్గశిర గురువారం లక్ష్మీ వ్రతం లేదా మార్గశిర లక్ష్మీవార వ్రతం వల్ల ఏడాదిలో మిగిలిన పదకొండు మాసాల్లో కూడా అష్టలక్ష్మీ వైభవం కలుగుతుందని చెబుతారు. అలాగే మార్గశిర పౌర్ణమి రోజు దానధర్మాలు చేయడం, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంతోషం, మానసిక ప్రశాంతత, శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు. ఈ రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల చంద్ర దోషం తగ్గి మానసిక రుగ్మతలు, ఆందోళన వంటివి తగ్గ మానసిక శాంతి కలుగుతుందని నమ్మకం. అలాగే పౌర్ణమి రోజు ఇంట్లో లేదా దేవాలయంలో శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినా, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం కథ విన్నా ఎంతో శుభప్రదం.

Exit mobile version