హిందువులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరమ పవిత్రమైన కార్తీక మాసం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. కార్తీకమాసం వచ్చింది అంటే చాలు నది స్నానాలు కార్తీకదీపం, శివ ఆరాధనలు మనకు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మాసంలో శివార్చనకు ప్రత్యేకత కూడా ఉంది. కాగా ఈ కార్తీక మాసంలో బిల్వ దళంతో శివుని పూజిస్తే మూడు జన్మల్లో చేసిన పాప దోషాలు తొలగిపోతాయని నమ్మకం.
అలాగే కార్తిక మాసంలో బిల్వ పత్రాలతో నిత్యం శివ పూజ చేయడం ద్వారా అనంత కోటి పుణ్యఫలాలు దక్కుతాయట. దీంతో, భక్తుల పూజలు అభిషేకాల కోసం ఆలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు. శ్రీ మహాలక్ష్మీ దేవి మారేడు దళాలలో స్థిరనివాసం ఉంటుంది. అందుకే కార్తిక మాసంలో శివుడిని మారేడు దళాలతో పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందట. అంతేకాకుండా ఈ మాసంలో ముఖ్యంగా సోమవారం రోజు శివాలయాలను సందర్శించడంతో పాటు పరమేశ్వరుడికి బిల్వపత్రాలను సమర్పించి అర్చన చేయించుకుని పూజలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయట.
అలాగే దీపాలు దానం చేయడం, దీపారాధన నూనె దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయట. ఈ మాసంలో ఆలయాల వద్ద దీపాలను వెలిగిస్తే మనం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.