Deeparadhana: ఏ దేవుడికి ఎలా దీపారాధన చేయాలి.. ఎదురుగా దీపం పెడితే జరిగేది ఇదే?

దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను మన శరీరంగా, వత్తిని మన మనసుగా భావించి వెలిగిస్తూ ఉంటారు. అగ్ని సంస్కారం అంటే జ్ఞానము, వెలిగించట అని అర్థము.

  • Written By:
  • Publish Date - March 24, 2024 / 09:00 PM IST

దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను మన శరీరంగా, వత్తిని మన మనసుగా భావించి వెలిగిస్తూ ఉంటారు. అగ్ని సంస్కారం అంటే జ్ఞానము, వెలిగించట అని అర్థము. శరీరమును, మనసును జ్ఞానముతో దేవునికి అర్పించుటే దీపారాధనలోని అంతరార్థం. దీపం ముమ్మూర్తులా పరబ్రహ్మ స్వరూపమే. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం. ఆ చీకట్లను పటాపంచలు చేసి, జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి.

అందుకే లోకంలో లక్ష్మీస్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి. దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయిందన్నదానికీ ఒక కథ కకూడా ఉంది. పూర్వం ఇంద్రుడు దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనై సకల సంపదలూ కోల్పోతాడు. అప్పుడు దిక్కుతోచక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చాడట. ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన సంపదలను పొందాడనీ అప్పటినుంచే లక్ష్మీ దేవి దీపలక్ష్మీదేవి అయిందనీ చెబుతారు. తమిళులు కూడా లక్ష్మీపూజ దీప స్తంభానికే నిర్వహిస్తారు. అమ్మవారి ప్రతిరూపాలు ఉన్న కుందుల్లో మీనాక్షి దీపాలను వెలిగిస్తారు.

జ్ఞానసముపార్జనకూ ఊర్ధ్వదృష్టికీ ప్రతీక అయిన దీపానికి మనం నమస్కరిస్తాం, ప్రదక్షిణలు చేస్తాం, పండగలు చేసుకుంటాం. దేవీ దేవతలను బట్టి దీపారాధనను సమర్పించే విధానమూ మారుతూ ఉంటుంది. శివుడికి ఎడమవైపు, విష్ణువుకి కుడివైపు దీపారాధన చేయాలి. ఏ దేవుడికీ ఎదురుగా దీపారాధన చేయకూడదు. అమ్మవారికైతే తెల్లని బియ్యం రాశిగా పోసి, దానిమీద వెండికుందిని పెట్టి దీపారాధన చేస్తే మేధస్సూ, సాత్విక మార్గంలో సంపాదనా పెరుగుతాయి. గుమ్మానికి ఎదురుగా ఉండే తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రావని నమ్ముతారు. శనీశ్వరుడిని పూజించడం మాట అటుంచితే తలచుకోడానికి కూడా చాలా మంది భయపడతారు. అయితే మనలోని జీవశక్తికీ, ఆయుష్షుకూ అధిదేవత శనీశ్వరుడే. అందుకే ఆయనకు అరచేతిలో నల్ల వస్త్రాన్ని తీసుకుని అందులో నల్లనువ్వులు పోసి మూటకట్టి దాన్నే వత్తిగా చేసి దీపారాధన చేయాలి. అలా చేస్తే శనిదోషాలు తొలగిపోతాయంటారు.