Dasara 2023 : శరన్నవరాత్రులకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఏ రోజు ఏ అవతారం అంటే..

అక్టోబర్ 16న శ్రీ గాయత్రీ దేవిగా, 17న అన్నపూర్ణాదేవిగా, 18న శ్రీ మహాలక్ష్మిగా, 19న శ్రీ మహాచండీ దేవిగా, 20 మూలానక్షత్రం రోజున సరస్వతీ దేవిగా, అక్టోబర్ 21న..

Published By: HashtagU Telugu Desk
indrakiladri

indrakiladri

Dasara 2023 : ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలకు, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ చేస్తారు. ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలలో.. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు.

అక్టోబర్ 16న శ్రీ గాయత్రీ దేవిగా, 17న అన్నపూర్ణాదేవిగా, 18న శ్రీ మహాలక్ష్మిగా, 19న శ్రీ మహాచండీ దేవిగా, 20 మూలానక్షత్రం రోజున సరస్వతీ దేవిగా, అక్టోబర్ 21న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, అక్టోబర్ 22న శ్రీ దుర్గాదేవిగా, అక్టోబర్ 23 విజయదశమి రోజున దుర్గమ్మవారు ఉదయం శ్రీ మహిషా సుర మర్దనీ దేవిగా, మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారాలలో దర్శనమివ్వనున్నారు. 23వ తేదీ సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం జరుగుతుంది.

కాగా.. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలకు 8 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని ఆలయ కమిటీ అంచనా వేసింది. భక్తుల రద్దీ దృష్ట్యా.. ఇంద్రకీలాద్రి కింద ఉన్న వినాయకుని గుడి నుంచి దుర్గమ్మ సన్నిధానం వరకూ నాలుగు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో అంతరాలయ దర్శనం నిలిపివేశారు. వృద్ధులు, వికలాంగుల కోసం బ్యాటరీ కార్లను అందుబాటులో ఉంచారు. అలాగే భక్తుల పుణ్య స్నానాల కోసం ఘాట్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే.. 5 వేల మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేయడంతో పాటు.. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా క్యూలైన్లను మానిటరింగ్ చేస్తున్నారు.

Also Read : Banks Closed: దసరా పండుగ సందర్భంగా బ్యాంకులకు భారీగా సెలవులు..!

 

  Last Updated: 15 Oct 2023, 06:23 PM IST