Bhadrachalam Temple భద్రాచలం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం. సీతారాములు కొలువైన భద్రాద్రి రాష్ట్ర విభజన నాటి నుంచి అభివృద్ధికి దూరమైంది. భౌగోళిక కారణాలతోపాటు రాజకీయ కారణాలు కూడా తోడు కావడంతో రాముడు ఎవరికీ పట్టనివాడయ్యాడు. కేసీఆర్ హయాంలో భద్రాచలం పురోగతి ఆగిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల చొరవతో సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంపై శ్రద్ధ పెడుతున్నారు. ఆలయాభివృద్ధి తోపాటు ఇతర కీలక సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సతీసమేతంగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సంప్రదాయం ప్రకారం సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరామనవమి రోజున పాలకులు పట్టువస్త్రాలు సమర్పించడం గోల్కొండ నవాబుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
కేసీఆర్ తర్వాత తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి భద్రాచలం రాములవారి పట్ల తన భక్తిని చాటుకుంటున్నారు. ఆయన క్రమం తప్పకుండా ఏటా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి హాజరవుతున్నారు. గతంలోనూ సీఎంలు ఏటా శ్రీరామనవమికి భద్రాచలం వెళ్లేవారు, కానీ కేసీఆర్ మాత్రం రెండు పర్యాయాలు మాత్రమే స్వయంగా వెళ్లగలిగారు.
కేసీఆర్ హయాంలో యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. భద్రాచలం ఆలయాన్ని సైతం రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. అయితే ఆ మేరకు నిధులను విడుదల చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాముడి పట్ల తన భక్తిని చాటుకుంటున్నారు.
మూడు దశల్లో భద్రాచలం ఆలయ విస్తరణ కోసం రూ.586 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్టు తొలి దశలో భాగంగా రూ.351 కోట్లతో చేపట్టే పనులకు శ్రీరామనవమి రోజునే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
కేసీఆర్ భద్రాచలం ఆలయానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి ఆయనకు కారణాలు ఉండవచ్చు. అలాగే భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం పాటుపడటానికి రేవంత్ రెడ్డికి కూడా కారణాలు ఉన్నాయి. గత మూడు ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే గులాబీ పార్టీ గెలిచింది. 2018 ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ హవా నడిచింది. అయితే ఆ ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పార్టీకి ఒక్క సీటే వచ్చింది. 2023 ఎన్నికల్లోనూ భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. అది కూడా స్వల్ప మెజారిటీతోనే. కొత్తగూడెంలో కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ గెలవగా.. మిగతా అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాగా వేయడానికి కేసీఆర్ పార్టీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అదే సమయంలో ఈ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భద్రాచలాన్ని అభివృద్ధి చేయడానికి ఇది కూడా ప్రధాన కారణమే. భద్రాచలాన్ని కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తే.. రేవంత్ అభివృద్ధి చేస్తున్నాడనే పేరుతోపాటు.. కష్టసమయంలో అండగా నిలిచిన ప్రాంతం రుణం తీర్చుకుంటున్నాడనే ఖ్యాతి కూడా రేవంత్ సొంతం కానుంది. రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన మాటకు కట్టుబడి మరో రెండున్నరేళ్లలో భద్రాచలం రూపురేఖలను మార్చగలిగితే.. వచ్చే ఎన్నికల్లో అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే అవకాశం ఉంది.
