ఎన్టీవీ (భక్తి ) యాజమాన్యం (NTV) ప్రతి ఏటా కార్తీకమాసంలో హైదరాబాద్ లో కోటి దీపోత్సవం (Koti Deepotsavam) కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోటి దీపోత్సవానికి ప్రత్యేక గుర్తింపు, ఆదరణ ఉంది. ఈ ఏడాది కూడా అంతే విధంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి రోజు వేలాదిగా భక్తులు ఈ దీపోత్సవంలో పాల్గొటున్నారు. నేడు కార్తీక పౌర్ణమి (Karthika Pournami) సందర్బంగా.. కోటి దీపోత్సవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సతీసమేతంగా హాజరై.. అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దంపతులకు అర్చకులు పట్టువస్త్రాలు బహూకరించారు.
ఇక ఈ కోటిదీపోత్సవం నవంబర్ 9 న మొదలైంది. నవంబర్ 25 వరకు అనగా 17 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈఏడాది శివ, కేశవుల థీమ్‌తో భారీ సెట్టింగ్ వేయడం జరిగింది. వేదికను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈసారి గతంలో కంటే ఎక్కువగా భక్తులు వస్తుండడం తో నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఏటికేడు భక్తుల నుంచి విశేష ఆదరణను పొందుతోంది.
ప్రముఖ ప్రవచనకర్తలు, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనామృతాలు, కళ్యాణ కమనీయాలతో ఈ కార్యక్రమం విరాజిల్లుతోంది. ప్రతి ఏడూ ప్రవచనాల అనంతరం ప్రత్యేక అర్చనలు, నిత్యం దేవదేవుల కళ్యాణ మహోత్సవాలు, నీరాజనాలతో ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతూ వస్తుంది. టీటీడీ, శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాల దేవదేవుల కళ్యాణ మహోత్సవాలను హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా వీక్షించి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోటి దీపోత్సవంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల దేవాతామూర్తులను చూసి భక్త కోటి పులకించిపోయే అద్భుత దృశ్యం ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా కనువిందు చేస్తుంది.
Read Also : Ka : రూ.50 కోట్ల క్లబ్ లో చేరిన ‘క’..ఇది కదా హిట్ అంటే..!!