చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని యావత్ హిందువులే కాదు రాజకీయ నేతలు , ముఖ్యమంత్రులు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఖండించగా, తాజాగా ఈ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) , అలాగే చినజీయర్ స్వామి (Chinna Jeeyar Swami) స్పందించారు.
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు(Chilkur Balaji Temple’s Chief Priest ) సీఎస్ రంగరాజన్ (C.S. Rangarajan)పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. రంగరాజన్ తన ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు అనుమతిలేకుండా లోపలికి చొరబడి రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని ఆయనను బెదిరించారు. అయితే దీనికి ఆయన నిరాకరించడంతో దుండగులు ఆగ్రహంతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసారు. ఇక ఈ దాడిపై త్రిదండి చిన్నజీయర్ స్వామి తీవ్రంగా స్పందించారు. అర్చకులపై హింస మానవతా విలువలకు విరుద్ధమని, అలాంటి దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఆలయ అర్చకుల ఆర్థిక పరిస్థితి, విద్యా అవకాశాలు సరైన విధంగా లేకపోవడానికి అనేక కారణాలున్నాయని చినజీయర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో హింసకు తావులేదని చిన్నజీయర్ స్వామి స్పష్టం చేశారు. హింస, తీవ్రవాదంతో శాశ్వత మార్పు సాధ్యం కాదని, రామరాజ్య స్థాపన రాజ్యాంగబద్ధంగా జరగాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కలిసి సంకల్పం చేస్తే నిజమైన రామరాజ్యం ఏర్పాటు అవుతుందని తెలిపారు. హింస ద్వారా ఎలాంటి సమాజహితం సాధ్యం కాదని, అర్చకుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని అభిప్రాయపడ్డారు.
‘Thandel’ : మూడు రోజుల కలెక్షన్లు ఎంతంటే..!
అలాగే ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. రంగరాజన్‌ను స్వయంగా ఫోన్‌లో పరామర్శించి, దాడిపై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాదని, బాధితులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఘటనపై ఇప్పటికే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. రంగరాజన్‌కు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. బాధిత అర్చకుడు తన సమస్యలను నేరుగా ఎమ్మెల్యే యాదయ్య లేదా ప్రభుత్వ అధికారులతో పంచుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం అన్ని విధాలా అర్చకులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.