Char Dham Yatra: ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రను (Char Dham Yatra) తదుపరి 24 గంటల పాటు నిలిపివేశారు. దీనికి కారణం పర్వత ప్రాంతాల్లో వాతావరణం అనుకూలించకపోవటం అని అధికారులు చెబుతున్నారు. చార్‌ధామ్ యాత్రా మార్గంలో కొండచరియలు విరిగిపడే ఘటనలు కూడా జరుగుతున్నాయి. అలాగే, తదుపరి 24 గంటల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పరిపాలన అప్రమత్తంగా ఉంటూ యాత్రను 24 గంటల పాటు నిలిపివేయాలని నిర్ణయించింది.
చార్‌ధామ్ యాత్రా మార్గంలో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడే ఘటనలు పెరిగాయని తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో కొండచరియల గురించిన వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా యాత్ర చేయాలని అధికారులు కోరడం జరిగింది. డెహ్రాడూన్ వాతావరణ శాఖ ప్రకారం.. రాష్ట్రంలోని డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, హరిద్వార్, చంపావత్, నైనీతాల్, ఉధమ్ సింగ్ నగర్‌లలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేయబడింది.
Also Read: Stampede: మరో తొక్కిసలాట.. ముగ్గురు భక్తులు మృతి, 50 మందికి గాయాలు.. వీడియో ఇదే!
యాత్రికులకు తగిన ఏర్పాట్లు
చార్‌ధామ్ యాత్ర నిలిపివేతకు సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్ డీఎం ప్రశాంత్ కుమార్ ఆర్య మాట్లాడుతూ.. డెహ్రాడూన్ వాతావరణ కేంద్రం భారీ వర్ష హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని గఢ్‌వాల్ కమిషనర్ ఆదేశాల మేరకు చార్‌ధామ్ యాత్రను తదుపరి 24 గంటల పాటు నిలిపివేశామని తెలిపారు. జిల్లాలో యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో ఆపివేయాలని పోలీసులకు, సంబంధిత ఎస్‌డీఎంలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు యాత్ర బంద్
వినయ్ శంకర్ పాండే న్యూస్ ఏజెన్సీ ANIతో యాత్ర గురించి మాట్లాడారు. తదుపరి 24 గంటల పాటు యాత్రపై నిషేధంతో పాటు పోలీసు, పరిపాలన అధికారులకు కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయని ఆయన తెలిపారు. ఈ సమయంలో హరిద్వార్, రిషికేష్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, వికాస్‌నగర్‌లలో యాత్రికులను ఆపివేయడం జరుగుతుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ యాత్ర నిలిపివేయబడుతుంది.