Site icon HashtagU Telugu

Pregnant Women Pooja : గర్భవతులు పూజలు, వ్రతాలు ఎందుకు చేయకూడదు..!!

pregnant women

pregnant women

మహిళలకు భక్తిభావం అధికంగా ఉంటుంది. పూజలు, వ్రతాలు ఎక్కువగా చేసేందుకు ఇష్టపడుతుంటారు. శ్రావణమాసం, కార్తీక మాసాల్లో అయితే తీరిక లేకుండా దేవుని సన్నిదానంలోనే గడిపేందుకు ఇష్టపడుతుంటారు. మరి స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా. అలా చేస్తే వారిపై వాస్తు ప్రభావం పడుతుందా అనే సందేహాలు ప్రతివారిలో వస్తుంటాయి.

వాస్తు ప్రభావం
గర్భవతిగా ఉన్న స్త్రీ ఉండే గృహ ప్రభావం ఆమెపైనా..ఆమె గర్భస్థ శిశువుపైనా పడుతుందని శాస్త్రం చెబుతోంది. అందుకే మూడు నెలలకు పైన గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటికి సంబంధించిన మార్పులు, కొత్త నిర్మాణాలు చేయకూడదు. ఇంటికి మార్పులు చేసేటప్పుడు పూర్తిగా చేయకపోయినా…కొత్త నిర్మాణాలు మధ్యలో ఏదైనా కారణం చేత ఆగిపోయినా వీటి వలన ఏర్పడే వాస్తు దోషాలు గర్భస్త శిశువుపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఇంటికి మార్పులు, చేర్పులు కానీ, కొత్త నిర్మాణం చేపట్టడం గానీ మంచిది కాదు.

పూజలు, వ్రతాలు
స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇవ్వంతో వాళ్లు మరింత తికమకపడుతుంటారు. ఈ సందేహానికి సమాధానం శాస్త్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంభించాలనీ కొబ్బరికాయను మాత్రం కొట్టరాదు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదని చెబుతోంది. కొత్త పూజా విధానాలను ఆరంభించడం గానీ పుణ్యక్షేత్రాల దర్శనం కూడా చేయరాదు.

కోటిసార్లు పూజచేయడం కంటే..ఒక స్తోత్రం చదవడం, కోటీ స్తోత్రాలు చదవడం కన్నా ఒకసారి జపం చేయడం…కోటిసార్లు జపం చేయడం కన్నా ఒకసారి ధ్యానం చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. అందుకే గర్భవతులు ధ్యానం చేయడం అన్నివిధాల మంచిదని సూచిస్తోంది. గర్భవతులకు పూజల విషయంలోఈ నియమం విధించడం వెనక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి కనిపించదు.

ఇక ఐదు నెల వచ్చే వరకు వ్రతాలు చేయవచ్చని…ఆ తర్వాత చేయరాదని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజలు, వ్రతాల పేరుతో వాళ్లు ఎక్కువసేపు నేలపై కూర్చోవడం మంచిది కాదనే ఈనియమం చేసినట్లు పండితులు చెబుతున్నారు. పుణ్యక్షేత్రాలు చాలా వరకు కొండలపై వుంటాయి కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ నియమాన్ని విధించినట్లు శాస్త్రం చెబుతోంది.