స్త్రీలు భక్తిశ్రద్ధలతో, ఇష్టపడి జరుపుకునే పూజలలో వరలక్ష్మి వ్రతం కూడా ఒకటి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి రకరకాల నైవేద్యాలు సమర్పించి మరి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. ఏడాది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజు ప్రత్యేకమైన రోజు. అలాంటి రోజులలో శ్రావణ శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. వరలక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల సంపద, సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. ఇక ఈ వ్రతం సందడి ప్రతి ఒక్కరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఈ వ్రతం చేసుకోవచ్చా చేసుకోకూడదా? చేసుకుంటే ఏమైనా నియమాలు పాటించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి శ్రావణమాసంలో వచ్చి వరలక్ష్మీ వ్రతాన్ని గర్భిణీ స్త్రీలు జరుపుకోవచ్చా లేదా అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గర్భిణీ స్త్రీలు కూడా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చని చెబుతున్నారు పండితులు. ఈ ఏడాది అనగా 2024 లో ఆగస్టు 16వ తేదీ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం వచ్చింది. కాగా గర్భం ధరించిన స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చట.అయితే ఐదు నెలలలోపు గర్భిణీలు మాత్రమే ఈ వ్రతం చేసుకోవాలి. ఆరో నెల వస్తే మాత్రం చేసుకోకూడదని చెబుతున్నారు. అలాగే కొబ్బరికాయ, గుమ్మడి కాయ కొట్టకూడదట. అలాగే క్షేత్ర దర్శనం చేసుకోకపోవడం మంచిదని చెబుతున్నారు పండితులు. పూర్వం ఆలయాలు కొండలు, గుట్టల మీద ఉండేవి. గర్భిణీ స్త్రీలు వాటిని ఎక్కడం ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. అది మాత్రమే కాకుండా భక్తుల రద్దీ ఆలయాల్లో ఎక్కువగా ఉండటం వల్ల గర్భిణీలకు అసౌకర్యంగా ఉంటుంది. అందుకే పూజల విషయంలో కొన్ని నియమాలు విధించారు.
అలాగే పూజ చేయాలంటే నేల మీద ఎక్కువ సేపు కూర్చోవాలి. దీని వల్ల నడుము నొప్పి, కాళ్ళు పట్టేయడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. గర్భవతిగా ఉన్న మహిళ ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పూర్వం పెద్దలు ఈ నియమాలు తీసుకొచ్చారు. అయితే పూజ చేయకపోయినప్పటికీ వరలక్ష్మీ వ్రతాన్ని చూడటం, కథ వినడం వంటివి చేసుకోవచ్చు. తేలికపాటి పూజలు చేసుకోవచ్చు. శారీరక శ్రమతో ఉండేవి చేయకపోవడం ఉత్తమం. పుణ్య క్షేత్రాలు దర్శించుకోవడం కూడా చేయకూడదు. ఇది శారీరకంగా అలసటను ఇస్తుంది. అందుకే దైవ నామ స్మరణ చేసుకుంటూ ధ్యానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతత ఉంటుంది.