Vontimitta: వటపత్రశాయిగా ఒంటిమిట్ట కోదండరాముడు!

ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Ontimitta

Ontimitta

ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీరామ నవమి కావడంతో కీలక ఘట్టమైన కోదండరామస్వామి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజాగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడ‌వ‌‌ రోజు మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరుగనుంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేస్తారు.

సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.  పురాణాల ప్రకారం.. జలప్రళయం సంభవించినపుడు శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ శిశువుగా దర్శనమిస్తారు. కుడికాలి బొటనవేలిని నోటిలో పెట్టుకుని ఆస్వాదిస్తుంటారు. ఈ ఘట్టాన్ని గుర్తుచేస్తూ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు భక్తులకు కనువిందు చేశారు. భక్తుల కష్టాలను కడతేర్చేందుకు ఎప్పుడూ ముందుంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేస్తున్నారు.

  Last Updated: 12 Apr 2022, 11:34 AM IST