Tirumala: తిరుమల (Tirumala)లో బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు అంటే ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఆలయం నుంచి మలయప్ప స్వామి దేవేరులతో కలిసి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారుతోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ ఉత్సవం ముగిసింది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి దంపతులు, పేష్కార్ రామకృష్ణ, పారు పత్తేదారు హిమత్ గిరి, ఇతర ఆలయ అధికారులు, శ్రీవారి భక్తులు పాల్గొన్నారు.
భాగ్ సవారి అంటే ఏమిటి?
పురాణాల ప్రకారం స్వామి వారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి దేవేరి సమేతంగా స్వామివారు తిరుమలలోని అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో వెళతారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షిణ దిశలో పారిపోయి ఆలయంలోకి ప్రవేశించి మాయమైపోతారు.
Also Read: GN Sai Baba :’సాయిబాబా భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగిస్తాం’: కుటుంబ సభ్యులు
అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసింది సాక్షాత్తు స్వామివారేనని విషయాన్ని గ్రహించి పశ్చాత్తాపపడతాడు. వెంటనే అమ్మవారిని బంధీ నుండి విముక్తురాలిని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తుని భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షిణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఈ బాగ్ సవారి ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ”భాగ్‌సవారి” ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్వామివారు సాయంత్రం 4 గంటలకు వైభవోత్సవ మండపం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. అంతకుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్సవం సందర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం నిర్వహించారు.