చాలామంది జీవితంలో మరణించే లోపు కనీసం ఒక్కసారైనా అరుణాచలం వెళ్లాలని అంటూ ఉంటారు. తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో అరుణాచలం కూడా ఒకటని చెబుతుంటారు. ముఖ్యంగా అరుణాచల గిరిప్రదక్షిణ కు చాలా ప్రాముఖ్యత ఉన్నది. అరుణాచలం వెళ్లినవారు తప్పకుండా గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అరుణాచలేశ్వరుడికి కూడా గిరిప్రదక్షిణ అంటే చాలా ఇష్టమని శాస్త్రం చెబుతోంది. అందుకే పరమశివుడు కూడా పార్వతీ దేవితో కలిసి సంవత్సరానికి రెండు సార్లు గిరి ప్రదక్షిణ చేస్తాడని పండితులు చెబుతన్నారు. గిరి ప్రదక్షిణ చేసే వారిని చూసి ఆ దేవదేవుడు చాలా సంతోషిస్తాడట. వారి కోరకలను కూడా నెరవేరుస్తాడట.
గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం. ఈ కొండ చుట్టూ దూరం సుమారుగా 14 కిలో మీటర్లు ఉంటుంది. అయితే దీని వెనుక పురాణాల ప్రకారం ఒక కథ కూడా ఉంది. అదేమిటంటే ఒకసారి గౌరీదేవి గౌతమ మహర్షిని గిరి ప్రదర్శన గురించి అడుగుతూ అరుణాచలంలో గిరిప్రదక్షిణ ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి అని అడగగా.. దీనికి గౌతమ మహర్షి సంతోషించి శివుడి కోసం ధ్యానించాడు. శివుడు ప్రత్యక్షమై గౌతమ మహర్శితో ఇలా అంటాడు. భూలోకంలో నేను అరుఛాలేశ్వర రూపంలో ఉన్నాను. అందుకే దేవతలు, మునులు అక్కడకు వచ్చి నాకు ప్రదక్షిణ చేస్తారు. నా చుట్టూ చేసే ప్రదక్షిణకు ప్రతీ అడుగుకు వారి జన్మజన్మల పాపాలు నశిస్తాయి. పుణ్య తీర్ధాల నుంచి వచ్చే ఎంతో పుణ్యము ఈ గిరి ప్రదక్షిణతో వస్తుంది. కొంచెం కూడా పుణ్యం చేయని పాపాత్ముడు నా చుట్టూ తిరగడం వల్ల చాలా శక్తులను పొందగలుగుతాడు.
ఒక అడుగుతో భూలోకప్రాప్తి, రెండవ అడుగుతో మధ్యలోక ప్రాప్తి, మూడవ అడుగుతో దేవలోక ప్రాప్తి కలుగుతుంది. మొదటి అడుగులో మానసిక పాపాలు తొలగిపోతాయ్. రెండవ అడుగులో వాచిక పాపములు తొలగిపోతాయ్, మూడవ అడుగులో శారీరక పాపాలు నశిస్తాయ్. ఈ అరుణాచలం చుట్టూ మునులూ, సిద్ధ పురుషుల ఆశ్రమాలు వేల సంఖ్యలో ఉన్నాయి. నేను సిద్ధ స్వరూపముతో ఈ అరుణాచలంలో వుంటూ వారిని చూస్తున్నాను. ఈ అరుణాచలం తేజో స్థంభం. ఈ తేజో లింగాన్ని మనసున ధ్యానిస్తూ నెమ్మదిగా ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా ప్రదక్షిణ చేస్తే వారి జన్మ జన్మల పాపాలు నశిస్తాయి అని గౌతమ మహర్షి తెలిపారు. నిండుచూలాలు ఎలాగైతే నడుస్తుందో గిరిప్రదక్షిణ అలా చేయాలి. గిరిప్రదక్షిణకు ముందు స్నానం చేయాలి, శుభ్రమైన వస్త్రాలని ధరించాలి, నుదుటన విభూది పెట్టుకోవాలి, రుద్రాక్ష మాలలు వేసుకోవాలి, అరుణాచల శివ అంటూ గిరిప్రదక్షిణ చేయాలి. ఇలా ప్రదక్షిణ చేసిన వారికి కనిపించని సిద్ధ పురుషులు వస్తుంటారు. మనసులో మరేమీ తలచకుండా కేవలం అరుణాచలుడిని మాత్రమే తలచుకొని ప్రదక్షిణ చేయాలి. దారి మధ్యలో దాన ధర్మాలు చేయడం చాలా మంచిది.
గిరిప్రదక్షిణ చేసిన వాళ్లు దైవశక్తిని పొందుతారు. శరీరం బలంగా మారుతుంది. దేవతలు కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. సోమవారం ప్రదక్షిణ చేస్తే జననమరణ బాధల నుంచి తప్పించుకోవచ్చు. మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. బుధవారం ప్రదక్షిణ చేస్తే మహాపండితుడు అవుతాడు. గురువారం ప్రదక్షిణ చేస్తే కారణజన్ముడు అవుతాడు. శుక్రవారం ప్రదక్షిణ చేస్తే సకల సంపదలు లభిస్తాయి. శనివారం ప్రదక్షిణ చేస్తే ప్రాపంచిక విజయాలు లభిస్తాయి. శారీరక బాధలు వున్న వారు ప్రదక్షిన చేస్తే వారి బాధలన్నీ తొలగిపోతాయి అని గౌతమ మహర్షి చెప్పుకొచ్చారు.