Bathukamma 2023 : బతుకమ్మ పండుగను ఎలా జరుపుకుంటారు.. ఏ రోజు ఏం నైవేద్యం పెడతారు?

బతుకమ్మ పండుగ అంటే రంగురంగుల పూలతో అనగా ఒక తాంబాలంలో తంగేడు పూలు, గునుగు పూలు, కట్లపూలు, సీతజడల పూలు.. ఇలా అనేకరకాల పూలతో బతుకమ్మను పేర్చి..

  • Written By:
  • Publish Date - October 15, 2023 / 06:28 PM IST

తెలంగాణలో(Telangana) అతిపెద్ద పండగ, మహిళల పండగ, పూల పండగ బతుకమ్మ(Bathukamma). ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు పూలతో పేర్చిన బతుకమ్మలతో, తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పించి జరుపుకుంటారు. అయితే బతుకమ్మ పండుగ అనేది ఆశ్వయుజ మాసం మొదలయ్యే అమావాస్య నుండి జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ అంటే రంగురంగుల పూలతో అనగా ఒక తాంబాలంలో తంగేడు పూలు, గునుగు పూలు, కట్లపూలు, సీతజడల పూలు.. ఇలా అనేకరకాల పూలతో బతుకమ్మను పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు అందరూ ఒక చోట చేరి, పాటలు పాడి, నాట్యాలు చేసి ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. అనంతరం ఆ బతుకమ్మను చెరువులు లేదా కుంటల వరకు ఊరేగింపుగా ఆడవారంతా వాటిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు.

మొదటిరోజున పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఆ రోజును పెత్రమాస అని కూడా అంటారు. ఆ రోజున బతుకమ్మను పేర్చి బతుకమ్మకు నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం గా పెడతారు.

ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నాడు రెండో రోజు అటుకుల బతుకమ్మను చేస్తారు. రెండో రోజున అనగా ఆశ్వయుజ పాడ్యమి నాడు సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం చేసి పెడతారు.

మూడవ రోజున ఆశ్వయుజ విదియ నాడు ముద్దపప్పు బతుకమ్మ అంటే ఆ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లం తో కలిపి నైవేద్యం చేస్తారు.

నాల్గవ రోజున ఆశ్వయుజ తదియ నాడు నానేబియ్యం బతుకమ్మ అంటే ఆ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

ఐదో రోజున అనగా ఆశ్వయుజ చవితి నాడు అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆరవ రోజున అనగా ఆశ్వయుజ పంచమి నాడు అలిగిన బతుకమ్మ అంటారు ఆ రోజున నైవేద్యాన్ని సమర్పించరు.

ఏడవ రోజున అనగా ఆశ్వయుజ షష్టి నాడు వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు. ఆ రోజున బియ్యంపిండిని వేయించి దానిని వేప పండ్లలాగా తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు.

నిమిదవ రోజున వెన్న ముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. ఆ రోజున నువ్వులను నైవేద్యంగా సమర్పిస్తారు.

తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ అంటారు ఈ రోజున ఐదు రకాల నైవేద్యాలను చేసి పెడతారు. పెరుగన్నం, పులిహార, కొబ్బరన్నం, నువ్వులన్నం, పెసరసత్తులను నైవేద్యాలుగా పెడతారు.