Balapur Laddu Velam Pata 2024 : నవరాత్రుల పాటు పూజలు అందుకున్న గణనాధుడు (Ganesh)..ఇప్పుడు తల్లి గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాడు. ఈ తొమ్మిది రోజులు వినాయకుడే కాదు..ఆయన చేతిలో లడ్డు (Laddu) కూడా పూజలు అందుకుంటుంది. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి ప్రసాదం అంటే భక్తులకు పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే వినాయకుడి కరుణ కటాక్షాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ లడ్డును భారీ ధరకు వేలంలో కొనుగోలు చేస్తుంటారు. నిమజ్జనం రోజు వేలం పాడి మరి చేజిక్కించుకుంటారు. వినాయకుడి లడ్డు వేలం పాట అంటే ప్రపంచ వ్యాప్తంగా అందరికి బాలాపూర్ లడ్డు వేలం (Balapur Laddu Velam Pata 2024) గుర్తుకొస్తుంది. ఇక్కడ ప్రతి ఏడూ లక్షల్లో పెట్టి లడ్డును దక్కించుకుంటారు.
ఈసారి ఎంత పలుకుతుందో అనే ఉత్కంఠ అందరిలో నెలకొని ఉండగా..ఆ ఉత్కంఠకు తెరపడింది. ఎప్పటిలాగే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ఏడాదీ బాలాపూర్ లడ్డూ వేలంపాట హోరాహోరీగా సాగింది. ఈసారి ఈ లడ్డూ ధర రూ.30,01,000 పలికింది. దీంతో గతేడాది రూ.27 లక్షల రికార్డు బద్దలైంది. సింగిల్ విండో ఛైర్మన్ కొలను శంకర్ రెడ్డి ఈ లడ్డూను తొలిసారి వేలంపాటలో దక్కించుకున్నారు. బాలాపూర్‌లో తొలిసారిగా 1980లో గణేశుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఉత్సవ నిర్వాహకులు 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించారు. తొలి వేలం పాటలో రూ.450కి స్థానికుడు కొలను మోహన్‌రెడ్డి గెలుపొందారు. పొందిన లడ్డూను కుటుంబసభ్యులకు ఇవ్వడంతోపాటు వ్యవసాయ క్షేత్రంలో చల్లారు. ఆ కుటుంబానికి, కొలను మోహన్‌రెడ్డికి ఆ ఏడాది అన్ని పనుల్లోనూ మంచి జరిగింది. లడ్డూ పొందడం ద్వారానే బాగా కలిసొచ్చిందని భావించిన మోహన్‌రెడ్డి, మరుసటి ఏడాది 1995లో మళ్లీ వేలంలో పాల్గొని లడ్డూను దక్కించుకున్నారు. అప్పుడు వేలం ధర రూ.4,500. నేటితో ఆ ధరను పోలిస్తే రూ.లక్షకు పైగా ఉంటుంది. ఆ సంవత్సరం కూడా లడ్డూ పొందిన అతడికి అన్ని విధాల కలిసి వచ్చింది. గత ఏడాది (2023 ) బాలాపూర్ లడ్డు ను దాసరి దయానంద్ రెడ్డి రూ. 27 లక్షలకు దక్కించుకున్నారు.
2014 నుంచి బాలాపూర్ లడ్డూను వేలంలో దక్కించుకున్న వారి పేర్లు, పలికిన ధర వివరాలు చూస్తే..
2014- సింగిరెడ్డి జైహింద్ రెడ్డి – రూ.9.50 లక్షలు
2015- కళ్లెం మదన్ మోహన్ రెడ్డి – రూ.10.32 లక్షలు
2016- స్కైలాబ్ రెడ్డి – రూ.14.65 లక్షలు
2017- నాగం తిరుపతి రెడ్డి – రూ.15.60 లక్షలు
2018- శ్రీనివాస్ గుప్తా – రూ.16.60 లక్షలు
2019- కొలను రామిరెడ్డి – రూ.17.60 లక్షలు
2020 – కరోనా కారణంగా వేలం పాట జరగలేదు
2021 – మర్రి శశాంక్ రెడ్డి, రమేశ్ యాదవ్- రూ.18.90 లక్షలు
2022 -పొంగులేటి లక్ష్మారెడ్డి – రూ.24.60 లక్షలు
ఈసారి బాలాపూర్ లడ్డు కన్నా తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్లో రికార్డ్ స్థాయిలో గణేశ్ లడ్డూ వేలంపాట జరిగింది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్లో నిర్వహించిన వేలంలో లడ్డూ ఏకంగా రూ.1.87కోట్లు పలికింది. గతేడాది ఇక్కడి లడ్డూ రూ.1.20 కోట్లు పలికింది. ఈసారి ఆ ధరను తలదన్నేలా వేలంపాట సాగింది.
Read Also : Study : ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రతి నలుగురిలో ఒకరు బరువు తగ్గించే మందులు వినియోగిస్తున్నారట..!