Astrology: నవగ్రహాల దోషాలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలాంటి దానాలు చేయాల్సిందే?

మామూలుగా ఆ ప్రతి ఒక్కరి జీవితాలపై గ్రహాలు తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తాయి. గ్రహాలు సరైన స్థానంలో లేకపోతే అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి

  • Written By:
  • Publish Date - February 9, 2024 / 06:00 PM IST

మామూలుగా ఆ ప్రతి ఒక్కరి జీవితాలపై గ్రహాలు తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తాయి. గ్రహాలు సరైన స్థానంలో లేకపోతే అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. జన్మలగ్నం దృష్ట్యా, గోచారాల దృష్ట్యా గ్రహాలు అనుకూలమైన స్థానాలలో లేనప్పుడు ఆయా గ్రహాల అనుకూలతలకు సంబంధించి కొన్ని దానాలను చేసినట్లయితే సానుకూలఫలితాలు ఉంటాయి. ఆ విధంగా దానం చేయడం వల్ల ఆ గ్రహాల వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయట. మరి ఏ ఏ గ్రహానికి ఎలాంటి దానం చేయాలి అన్న విషయానికి వస్తే.. రవి గ్రహ దోషం ఉన్నవారు గోధుమ పిండి, గోధుమ రొట్టె, రాగి జావ, రాగులు, మిరియాలు వంటి వస్తువులు దానం చేస్తే మంచిది.

అలాగే నారింజ రంగు వస్త్రాలను దానం చేయడం కూడా మంచిదే. చంద్ర గ్రహ దోషం ఉన్నవారు అన్న దానం చేస్తే మంచిదని, తెల్లని కాటన్ వస్త్రాలను దానం చేస్తే మంచిది. తెల్లటి పదార్థాలైన బియ్యము, పాలు, నీళ్లు, పొంగలి, వెండి వస్తువులను దానం చేస్తే మంచిది. అలాగే కుజ గ్రహ దోషం ఉన్నవారు ఎర్రటి వస్త్రాలను దానం చేస్తే మంచిది. వాటితోపాటు కందిపప్పు, మిరపకాయలు, పచ్చి ఖర్జూర, బెల్లం వ్యవసాయ పనిముట్లు దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. బుధగ్రహ దోషం ఉన్నవారు విద్యా సంబంధమైన వస్తువులను దానం చేస్తే మంచిది. ఆవుకి పచ్చ గడ్డి వేయడం, ఆకుపచ్చ వస్త్రాలు దానం చేయడం చేస్తే మంచిది.

అంతేకాదు పెసర పప్పు, ఆకుకూరలు, కూరగాయలు దానం చేయాలి. గురు గ్రహ దోషం ఉన్నవారు పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం మంచిది. వారు పండ్లు, తీపి పదార్థాలు, శనగ గుగ్గిళ్ళు, తియ్యని పానీయాలు, బఠానీ గుగ్గిళ్ళు, భోజనం వంటివి దానం చేస్తే మంచిది. శుక్ర గ్రహ దోషం ఉన్నవారు రంగురంగుల వస్త్రాలను వేటినైనా దానం చేయవచ్చు. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన బొట్టు బిళ్ళలు, జడ పిన్నులు, రబ్బర్ బ్యాండ్ లు, గోళ్ల రంగులు, సెంటు, అద్దాలు, పౌడర్లు, పూలు , గోరింటాకు దానం చేస్తే మంచిది. అంతేకాదు బొబ్బర్లు, అలసందలు, డ్రైఫ్రూట్స్ మొదలైనవి కూడా దానం చేయవచ్చు. శని గ్రహ దోషం ఉన్నవారు నీలి రంగు వస్త్రాలను దానం చేస్తే మంచిది.

శని గ్రహ దోషం పోవాలంటే నూనె, నువ్వులు, ఇనుము, దేవాలయాలకు సిమెంట్, కార్మికులకు, పని చేసే వారికి వస్తువులు రూపంలో గాని, ధనరూపంలో గాని దానాలు చేస్తే మంచిది. రాహు గ్రహ దోషం ఉన్నవారు బూడిద రంగు వస్త్రాలను దానం చేయాలి. అంతే కాదు వారు ఇడ్లీలు, మినప గారెలు, సున్నుండలు దానం చేయాలి. నానబెట్టిన మినుములు ఆవుకు పెట్టడం మంచిది. ఇక కేతు గ్రహ దోషం ఉన్నవారు పశువులకు, పక్షులకు, చేపలకు ఆహారం పెట్టాలని, ఉలవల పొడిని ఆవులకు పెట్టాలి. అంతేకాదు కొన్ని అరుదైన రంగుల వస్త్రాలను దానం చేయడం మంచిది. ఇలా నవగ్రహాల దోషాలకు సరైన దానధర్మాలు చేస్తే, దోషాలు తొలగిపోయి జీవితం సజావుగా సాగుతుంది.