Vastu : ఈ రోజు అప్పు చేయకండి…జీవిత కాలంలో తీరదు..!!

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 10:45 AM IST

ఎంత పెద్ద ధనవంతుడైనా సరే…ఒకానొక సమయంలో అప్పు చేయకతప్పదు. చిన్నా పెద్దా అవసరాలకు అప్పులు చేస్తుంటాం. సరైన సమయానికి డబ్బు అందనప్పుడు..ఇతరుల దగ్గరు అప్పుగా తీసుకోవడం సాధారణం. ఈఎంఐలు, క్రెడిట్ కార్లు ఇవ్వన్నీ కూడా అప్పులు కిందకే వస్తాయి. అయితే అప్పు చేసే ముందు కాస్త ఆలోచించి చేయాలి. ఎందుకంటే వాస్తు ప్రకారం…వారంలో కొన్ని రోజులు అస్సలు అప్పు తీసుకోకూడదు.

ఎందుకంటే తిరిగి చెల్లించడం చాలా కష్టంగా మారుతుంది. అందుకే సరైన సమయంలో అప్పు తీసుకోవడం మంచిది. అప్పు చేసిన వ్యక్తిలో ఆందోళన ఉంటుంది. దీంతో శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొవల్సి వస్తుంది. ఒక్కోసారి అప్పులు ఎక్కువై…వాటిని తీర్చలేక జీవితం కాలం ఆ భారాన్ని మోయాల్సి వస్తుంది.

అయితే జ్యోతిష్య శాస్త్రంలో అప్పు తీసుకునేందుకు…ఇచ్చేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. శాస్త్రం ప్రకారం…శుభముహుర్తంలో రుణం తీసుకుంటే సులభంగా తిరిగి చెల్లిస్తాం. అయితే అప్పు ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు అప్పు తీసుకోకూడదు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం…అప్పు తీసుకోవడానికి సమయం, తేదీ చాలా ముఖ్యం. ఎందుకంటే చెడు సమయంలో అప్పు తీసుకుంటే ఎన్నో సమస్యలు ఎదుర్కో వల్సి వస్తుంది. శాస్త్రం ప్రకారం…మంగళవారం, బుధవారం, శనివారాల్లో అప్పులు తీసుకోకూడదు. హస్త, మూల, అద్ర, జ్యేష్ట, విశాఖ, ఉత్తరాఫాల్గుణి, ఉత్తరాషాడ, ఉత్తర భాద్రపద, రోహిణి మొదలైన నక్షత్రాల్లో అప్పులు చేయకూడదు. ఈ సమయంలో తీసుకుంటే తిరిగి చెల్లించడం కష్టంగా మారుతుంది.

ముఖ్యంగా మంగళవారం అంగారుకుడిచే పాలించబడుతుంది కాబట్టి…దుష్టగ్రహంగా పరిగణిస్తారు. అంగారకుడు కోపం, అశాంతి, ప్రతీకార స్వభావంతో ఉంటాడు. కాబట్టి మంగళవారం అప్పు తీసుకోకూడదు. కానీ ఈ రోజున పాత రుణాన్ని తిరిగి చెల్లించడం మంచిది. కాబట్టి మీరు ఎవరికైనా అప్పు బకాయి ఉంటే మంగళవారం దాన్ని చెల్లించే ప్రయత్నం చేయండి.

అనుకూలమైన రోజులు
సోమవారం, గురువారం,శుక్రవారం, ఆదివారాల్లో అప్పు తీసుకుంటే మంచిది. ఇవి శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో అప్పులు తీసుకుంటే తొందరగా తిరిగి చెల్లిస్తారు. శాస్త్రం ప్రకారం స్వాతి, పునర్వసు, ధనిష్ట, శతభిష, మృగశిర, రేవతి, చిత్ర, అనురాధ, అశ్విని, పుష్య నక్షత్రాలలో రుణం తీసుకోవడం లాభదాయకం.