హైదరాబాద్‌లోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు(Chilkur Balaji Temple’s Chief Priest ) సీఎస్ రంగరాజన్ (C.S. Rangarajan)పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. రంగరాజన్ తన ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు అనుమతిలేకుండా లోపలికి చొరబడి రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని ఆయనను బెదిరించారు. అయితే దీనికి ఆయన నిరాకరించడంతో దుండగులు ఆగ్రహంతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసారు.
ఈ దాడికి వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఇక్ష్వాకు వంశ వారసుడిగా ప్రకటించుకున్న వీరరాఘవరెడ్డి ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి, రామరాజ్యం స్థాపన కోసం ప్రచారం చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం తన అనుచరులతో కలిసి చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చి, రంగరాజన్‌తో చర్చించేందుకు ప్రయత్నించాడు. అయితే రంగరాజన్ రామరాజ్య ప్రతిపాదనను తిరస్కరించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో వీరరాఘవరెడ్డి తన అనుచరులతో కలిసి రంగరాజన్‌పై దాడి చేసి, ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసాడు. ఈ ఘటనపై ఏపీ అర్చక సమాఖ్య తీవ్రంగా స్పందించింది. అర్చకులపై దాడిని ఖండిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సమాఖ్య అధ్యక్షుడు అగ్నిహోత్రం ఆత్రేయబాబు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసుల స్వామి దేవాలయాల్లో పూజారుల భద్రతపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.