Site icon HashtagU Telugu

TTD: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు : ఈవో

Bomb Threats In Tirumala

Bomb Threats In Tirumala

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నట్లు ఈవో చెప్పారు.

ఈ సందర్భంగా డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ధర్మారెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు. భక్తులు క్యూలైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు గాను టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా డిసెంబరు 22 నుంచి 4,23,500 టోకెన్లు జారీ చేస్తాం.

తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, శ్రీగోవిందరాజస్వామి రెండో సత్రం, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహం వద్ద టోకెన్‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తాం. దర్శనానికి టోకెన్లు తీసుకున్న భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని ఆయన తెలిపారు.