Ganesh Chaturthi : భాద్రపద మాసం రాగానే వినాయక చవితి ఉత్సవాలతో ఊరువీధులు సందడిగా మారతాయి. గల్లీల్లో పెద్ద పెద్ద మండపాలు, ఇళ్లలో భక్తులు ప్రతిష్టించే గణనాథుల విగ్రహాలతో పండుగ వాతావరణం నెలకొంటుంది. మార్కెట్‌లలో తీరు తీరు రంగులతో, విభిన్న భంగిమల్లో ఉన్న వినాయక విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తాయి. ఈ సందర్భంలో విగ్రహం ఎలా ఉండాలి, ఏ దిశలో తొండం ఉండాలి అనే విషయాలు అత్యంత ప్రాముఖ్యమైనవని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.
పండితుల ప్రకారం, ఇంట్లో పూజించుకోవడానికి ఎడమ వైపు తొండం వంగి ఉన్న వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించడం శుభప్రదం. ఎడమ వైపు తొండం ఉన్న గణనాథుడు భక్తుల కోరికలను తీర్చడమే కాకుండా, స్థిరత్వం, శ్రేయస్సును ప్రసాదిస్తాడని విశ్వాసం. అలాగే గణపతి విగ్రహం కూర్చున్న భంగిమలో ఉండడం ఆధ్యాత్మిక శక్తి, ప్రశాంతతకు సంకేతమని నమ్మకం. ఇలాంటి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టిస్తే సౌఖ్యం, ఆనందం, సమతౌల్యం లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే వినాయకుడి రంగు కూడా ప్రత్యేకత కలిగినదే. ఎరుపు లేదా సింధూర రంగు విగ్రహాలు శక్తి, ఉత్సాహానికి ప్రతీకగా భావిస్తారు. తెలుపు రంగు విగ్రహాలు ఇంట్లో శాంతి, ప్రశాంతతను కలిగిస్తాయి. విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఉత్తమమైన దిశ ఈశాన్యం. అది సాధ్యం కాని పరిస్థితుల్లో ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచవచ్చు. ఈ విధంగా సరైన రూపం, తొండం దిశ, రంగు, ప్రతిష్టించే స్థానం అన్నీ కలిసివస్తే గణపతి ఆశీస్సులు మరింత ఫలప్రదంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.